కర్ణాటకలో 2023 ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి రాగానే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ముస్లిం మైనారిటీ ప్రత్యేక రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బొమ్మై ప్రభుత్వం తీసుకున్న ముస్లిం కోటా రద్దు నిర్ణయాన్ని ఎండగడుతూ.. మైనారిటీలకు ఈ హామీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం కోల్పోతుందని.. అందుకే భావోద్వేగ సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తోందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మే నెలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేపీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
"రిజర్వేషన్లను ఆస్తిలాగా పంచవచ్చని వారు భావిస్తున్నారు. ఇది ఆస్తి కాదు మైనారిటీల హక్కు. వీరికి ఉన్న 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను రద్దు చేసి.. ప్రధాన సామాజిక వర్గాల్లోని వారికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. మైనారిటీ సభ్యులు మా సోదరులు, కుటుంబసభ్యులు. వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లు ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారు. రాబోయే 45 రోజుల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటన్నింటిని రద్దు చేస్తాం. ముస్లింలను ఓబీసీల జాబితా నుంచి తొలగించడానికి ఎటువంటి కారణాలు లేవు. బొమ్మై ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే భావోద్వేగ సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తోంది"
--డీకే శివకుమార్, కర్ణాటక పీసీసీ చీఫ్
ముస్లింలకు దశాబ్దాలుగా ఉన్న 4 శాతం రిజర్వేషన్లను పూర్తిగా తొలగించడం మైనారిటీ వర్గాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పేర్కొంది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ కోటాలోకి మార్చడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది మైనారిటీ వర్గాలను మోసం చేసే ప్రయత్నమని ఆ పార్టీ ఆరోపించింది. 'ఈడబ్ల్యూఎస్ కోటాను ఆర్థిక పరిస్థితి, ఆదాయం ఆధారంగా చేసుకుని కేటాయిస్తారు. ఇది కులం లేదా మతం ఆధారంగా ఏర్పాటు చేసింది కాదు. ఏ కులం లేదా మతానికి చెందిన సభ్యుడైనా.. తనకున్న ఆర్థిక స్థితి ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు అర్హులు' అని కాంగ్రెస్ తెలిపింది. అయితే "బొమ్మై ప్రభుత్వం ఏ ఆధారంతో ముస్లిం మైనారిటీలను ఈడబ్ల్యూఎస్ కోటాలో చేర్చింది?" అని బొమ్మై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇప్పుడు ఎందుకీ చర్చ?
ఇదివరకు కర్ణాటకలో ఓబీసీ కేటగిరీలో 2బీ అనే రిజర్వేషన్ కోటా ఉండేది. దానిలో భాగంగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కేటాయించారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్‌ను ముస్లిం మైనారిటీకి తొలగించి.. వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వొక్కలిగ, వీరశైవ-లింగాయత్‌లకు రిజర్వేషన్ల కోసం ఈడబ్ల్యూఎస్‌లో 2సీ, 2డీ కేటగిరీలను గతంలోనే ఏర్పాటు చేశారు. ముస్లిం మైనారిటీలకు రద్దు చేసిన 4 శాతం రిజర్వేషన్లను 2సీ, 2డీలకు సమానంగా పంచనున్నారు. మతపరమైన మైనారిటీలను ఈడబ్ల్యూఎస్ జాబితాలో చేర్చాలని శుక్రవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.