Siddaramaiah Oath Taking Ceremony : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదికపై ప్రతిపక్షాలు ఐక్యతా రాగం వినిపించాయి. ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు బీజేపీ వ్యతిరేక పక్షాలు హాజరయ్యాయి. దేశంలోని విపక్షాల నేతలంతా కదిలొచ్చి తమ ఐక్యతను ప్రదర్శించారు. ఒక వేదికపై విపక్షాలన్నీ కలిసి కనిపించడం.. 2014 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.

ఏడు రాష్ట్రాల సీఎంలు హాజరు..
కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకార వేడుకకు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

శరద్‌పవార్, కమల్ హాసన్ కూడా..
Karnataka CM Siddaramaiah : ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పీడీఎఫ్ చీఫ్ మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, వామపక్ష నేతలు సీతారం ఏచూరి, డి. రాజా, మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ పాల్గొని ఐక్యత చాటారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, పార్టీ అధినేతలు, వామపక్ష నేతలు ఒకే వేదికపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే ఉత్సాహాన్ని రానున్న కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

'విపక్షాల ఐక్యతకు వేదికగా కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం'
విపక్షాల ఐక్యతకు, బల ప్రదర్శనకు కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని.. తనకు వారితో పాత స్నేహం ఉందని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. విపక్షాల ఐక్యతపై అడిగిన ప్రశ్నకు దానికి సరైన సమయం రావాలని అన్నారు. విపక్షాల ఐక్యతతో కేంద్రంలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్.. ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్లే యత్నం చేస్తోంది. తమ వైపు పేదలు, రైతులు ఉన్నారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. వారి అండతో ముందుకు సాగుతామన్నారు.

"కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది.. ఎలా గెలిచింది అనే దానిపై భిన్నమైన విశ్లేషణలు జరిగాయి. మేం గెలవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడి తరగతులకు అండగా ఉంది. మా దగ్గర నిజం ఉంది. పేద ప్రజలు ఉన్నారు. బీజేపీ దగ్గర డబ్బు, పోలీసులు, అధికారం అన్నీ ఉన్నాయి. విద్వేషాన్ని కన్నడ ప్రజలు ఓడించారు. విద్వేషంపై ప్రేమ విజయం సాధించింది"
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత
దీదీ ఆబ్సెంట్!
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట మద్దతు ఇస్తామని ప్రకటించిన బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి రాకపోవడం గమనార్హం.
