Karnataka CM : కన్నడ రాజకీయం దిల్లీ చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో అఖండ మెజారిటీ సాధించిన కాంగ్రెస్.. కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతుంది!. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పోటీ పడడమే అందుకు కారణం. ఇప్పటికే సీఎల్పీ సమావేశం నిర్వహించి 135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల బృందం నివేదికను సిద్ధం చేసింది.
అయితే ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు భన్వర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. సోమవారం దిల్లీ చేరుకోనున్న పరిశీలకుల బృందం.. ఖర్గేకు నివేదిక అందివ్వనుంది. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రకటించనుంది. ఈ నెల 18నే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
సిద్ధ X డీకే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు
మల్లికార్జున ఖర్గే కర్ణాటక పుత్రుడన్న రణదీప్ సుర్జేవాలా.. ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు ఆయనకు ఎక్కువ సమయం పట్టబోదని తెలిపారు. మరోవైపు కర్ణాటక సీఎం పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బెంగళూరులోని షాంగ్రీలా హోటల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. డీకే శివకుమార్ కలిసి మంతనాలు చేశారు. సిద్ధరామయ్య కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దిల్లీకి సిద్ధరామయ్య
Karnataka Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానం చేతుల్లోకి వెళ్లడం వల్ల సిద్ధరామయ్య, డీకే శివకుమార్ దిల్లీ వెళ్లనున్నారని ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, పరిశీలకుల బృందంతో జరిగే భేటీలో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే సిద్ధరామయ్యకు దిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన బయలు దేరారు.
నేనేం దిల్లీ వెళ్లట్లేదు: డీకే శివకుమార్
Karnataka Dk Shiva Kumar : దిల్లీ వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నానన్న డీకే శివకుమార్.. తనకు అధిష్ఠానం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. తాము ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించి కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపామని తదుపరి నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని తెలిపారు. పార్టీ కోసం తాను చేయాల్సింది చేశానని.. ఇక మిగిలింది అధిష్ఠానమే చూసుకుంటుందని శివకుమార్ వెల్లడించారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై స్పందించిన శివకుమార్.. శుభ ముహూర్తం చూసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాను దిల్లీ వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
అవసరమైతే డీకే, సిద్ధను దిల్లీకి పిలుస్తాం: శిందే
కర్ణాటక సీఎం రేసులో ఉన్న సిద్ధరామయ్య, శివకుమార్‌ను అవసరమైతే దిల్లీకి పిలుస్తామని కాంగ్రెస్ నేత, శాసనసభా పక్ష సమావేశానికి పరిశీలకుడిగా ఉన్న సుశీల్ కుమార్ శిందే తెలిపారు. "సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలతో రూపొందించిన నివేదిక రహస్యమైనది. దానిని మేము బయటపెట్టలేం. మల్లికార్జున్ ఖర్గే మాత్రమే దానిని బహిర్గతం చేస్తారు" అని శిందే వ్యాఖ్యానించారు.
డీకే శివకుమార్ బర్త్‌డే.. తరలివచ్చిన కార్యకర్తలు
DK Shiva Kumar Birthday : మరోవైపు సోమవారం డీకే శివకుమార్ జన్మదినం సందర్భంగా అభిమానులు.. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు.. శివకుమార్ నివాసం బయట గంటల తరబడి వేచి చూశారు. శివకుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలుపుతూ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు . కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం అందించి.. కన్నడ ప్రజలు తనకు మరచిపోలేని పుట్టినరోజు కానుక ఇచ్చారని శివకుమార్ తెలిపారు. తన జీవితం కర్ణాటక ప్రజలకు సేవ చేసేందుకు అంకితమని ప్రకటించారు.
Karnataka Election Results : 224 స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభకు ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీకి 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి.