'ఆ నియోజకవర్గంలో మీరు అడుగుపెట్టొద్దు'.. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థికి ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఆదేశాలివి! ఆశ్చర్యంగా ఉంది కదూ! హోరాహోరీగా జరిగే శాసనసభ ఎన్నికల్లో.. నియోజకవర్గానికి వెళ్లకపోతే ఎలా? ప్రచారం ఎలా చేస్తారు? ఓటర్లను ఆకట్టుకునేదెవరు? ప్రస్తుతం ఈ చర్చంతా ధార్వాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన వినయ్ కులకర్ణి గురించే. ఆయనను సొంత నియోజకవర్గానికి కోర్టు వెళ్లవద్దని ఆదేశించడం వెనుక ఓ పెద్ద కథే ఉంది.
వినయ్ కులకర్ణి.. మాజీ మంత్రి. ప్రస్తుతం కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ధార్వాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి. మరి ఆయనే కదా ఎన్నికల్లో ముందుండి ప్రచారాన్ని నడపాల్సింది. అయితే అది వీలు పడేలా లేదు. ఎందుకంటే ఆయన ధార్వాడ్ నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు కర్ణాటక ప్రత్యేక కోర్టు అనుమతి నిరాకరించింది. వినయ్.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ గౌడ హత్య కేసులో నిందితుడు. అందుకే కోర్టు.. వినయ్ కులకర్ణి ధార్వాడ్లో పర్యటించేందుకు అనుమతివ్వలేదు.
యోగేశ్ హత్య కేసులో వినయ్ కులకర్ణి నిందితుడిగా ఉండడం వల్ల ఆయన ధార్వాడ్లోకి ప్రవేశించకుండా సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ధార్వాడ్‌ను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గత వారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయనను స్థానిక కోర్టులో అప్పీలు చేసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో వినయ్ కులకర్ణి.. కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే.. మంగళవారం ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ధార్వాడ్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టేందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.
ఇదీ కేసు..
2016లో జిమ్ వెలుపల బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేశ్ గౌడను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి వినయ్ కులకర్ణి.. అరెస్టై కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం బెయిల్పై కొన్నాళ్ల క్రితం విడుదలయ్యారు.
సీఎంపై పోటీ!..
ఆంతకుముందు వినయ్ కులకర్ణి.. శిగ్గావ్ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆఖరికి ఆయన ధార్వాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. అయితే యోగేశ్ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉండడం వల్ల ఆయనను ధార్వాడ్లో ప్రవేశించేందుకు కోర్టు అనుమతించలేదు.
కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జేడీఎస్ పార్టీ కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడుతోంది. బీజేపీ నేతలు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలో చేరుతున్నారు.