బైకులు, కార్లను చోరీ చేసి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో విందులు వినోదాలు చేసుకునే దొంగలున్నారు! అయితే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు దొంగలు... అంతకుమించి. లాక్డౌన్ కారణంగా రోడ్డు పక్కనే పార్కు చేసిన ఓ రోడ్ రోలర్‌ను కొట్టేశారు. పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే డీలర్‌తో కిలో రూ.28 చొప్పున బేరం కుదుర్చుకున్నారు.
![road roller theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-08-road-roller-theft-story-developments-till-now-chandra-layout-police-one-arrest-ka10032_23062021194340_2306f_1624457620_498_2406newsroom_1624512022_995.jpg)
నగరంలోని చంద్ర లేవుట్ వద్ద కొన్ని రోజులుగా పార్కు చేసి ఉన్న రోడ్ రోలర్‌ను కేటుగాళ్లు గుర్తించారు. అదును చూసి అక్కడ నుంచి.. అన్నా బైదరహళ్లి సమీపంలోని సీగహళ్లికి తరలించారు. గ్యాస్ కట్టర్ మిషన్‌తో మూడు ముక్కలు చేశారు. అనంతరం బేరం పెట్టారు. కొనుగోలుకు ఒప్పుకున్న వ్యక్తి కూడా ఈ చోరీ కేసులో ఇరుక్కున్నాడు.
యజమాని ఫిర్యాదుతో..
తమిళనాడు చెందిన వీ సెల్వరాజ్ 12ఏళ్ల క్రితం అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి వద్ద రోడ్ రోలర్‌ను కొనుగోలు చేశారు. ఆ రోలర్‌ను పని కోసం కర్ణాటకకు తరలించారు. అయితే లాక్డౌన్ కారణంగా పని లేకపోవడం వల్ల దానిని చంద్ర లేఔట్ ప్రాంతంలోని ఓ మైదానంలో పార్కు చేసి మే 25న సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. తిరిగి ఈ నెల 19 వచ్చి చూసేసరికి రోలర్ కనిపించలేదు. దీంతో చంద్ర లేఔట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు సెల్వరాజ్. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
దీనిలో భాగంగా పట్టణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రోలర్‌ను ఓ ట్రక్కులో తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో నగరభావికి చెందిన ఎన్ వినయ్ ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. మరో నిందితుడు, రోలర్‌ను సీగహళ్లికి తరలించిన డ్రైవర్ పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
![road roller theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-08-road-roller-theft-story-developments-till-now-chandra-layout-police-one-arrest-ka10032_23062021193907_2306f_1624457347_152_2406newsroom_1624512022_546.jpg)
"వాహనం చోరీ కేసులో పవన్ కుమార్‌ను అరెస్టు చేశాం. కిలో రూ.28 చొప్పున అమ్మడానికి పాత ఇనుప సామాన్ల డీలర్ ఇస్మాయిల్‌తో వినయ్ బేరం కుదిర్చాడని పవన్ చెప్పాడు. ఆ రోడ్ రోలర్ మొత్తం బరువు 7,800కేజీలు. వినయ్, ఇస్మాయిల్ కోసం గాలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: మరుగుదొడ్ల వ్యర్థాలు కలిసిన నీళ్లు తాగి.. ఇద్దరు మృతి!