Bridge Theft In Bihar: బిహార్‌లో దొంగలు మరోసారి తమ పనితనాన్ని చూపించారు. రోహ్తాస్ జిల్లాలో 60 అడుగుల బ్రిడ్జ్‌ను ఎత్తుకెళ్లిన ఘటన జరిగిన నెలరోజుల్లోనే మరో వంతెనను మాయం చేశారు. ఈసారి బాంకా జిల్లా చందన్ బ్లాక్‌లో జరిగింది. 2004 నాటి 80 అడుగుల ఐరన్ బ్రిడ్జ్‌ను గ్యాస్ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది.
ఝాఝా, పటనియా మధ్య ఉన్న వాగుపై 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. 1995లో భారీ వరదల సమయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రావణి జాతరలో ఝాఝా గ్రామం నుంచి పటనియా ధర్మశాలకు వెళ్లేందుకు ఊరేగింపు పెద్ద వాగులో నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పలువురు ప్రమాదానికి గురయ్యారు. దీంతో వంతెన నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేశారు. అప్పటి జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో వంతెన నిర్మించిన తర్వాత భక్తులు సులభంగా బాబా ధామ్‌కు చేరుకోగలిగారు. అయితే, పుక్కా బ్రిడ్జ్ సహా కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో దీనిని వినియోగించటం లేదు. దీంతో ఈ బ్రిడ్జ్‌పై దొంగల కళ్లు పడ్డాయి.
వంతెన చోరీకి గురైనట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదన్నారు పోలీసు అధికారి నషీమ్ ఖాన్. ఈ విషయంపై విచారణ చేపడతామన్నారు.'ఈ బ్రిడ్జ్‌ను రూ.46 లక్షలతో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో నిర్మించారు. కొత్త వంతెన నిర్మించిన తర్వాత దాని వాడకం తగ్గింది. బ్రిడ్జ్ చోరీ విషయం మా దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం.' అని తెలిపారు.
ఇదీ చూడండి: 60 అడుగుల బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు.. అధికారులు షాక్