దిల్లీ మాల్వియా నగర్లో 'బాబా కా దాబా' పేరుతో చిన్న బండిలో ఆహార పదార్థాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధ దంపతులు గుర్తున్నారా? కరోనా సంక్షోభం వారిని దెబ్బతీస్తే.. మానవతావాదులు ఆదుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారి పరిస్థితిని వివరిస్తూ ఓ వ్యక్తి పోస్ట్ చేయగా పలువురు సాయం అందించారు. ఇప్పుడు ఆ సాయంతో ఓ కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు కాంతా ప్రసాద్ (80), బదామి దేవి దంపతులు.
నాలుగు నెలల క్రితం కాంతా ప్రసాద్ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో పలువురు దాతలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు సుమారు రూ.40 లక్షల వరకు సాయం అందినట్లు తెలుస్తోంది. అలాగే.. కొత్త హోటల్‌కు కావాల్సిన నాలుగు టెబుళ్లు, 16 కుర్చీలు సమకూర్చారు.
కొత్త రెస్టారెంట్‌తో పాటు పాత బండి నడిపిస్తానని చెబుతున్నారు కాంతా ప్రసాద్. సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
" మేము చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మాకు సాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. మా రెస్టారెంట్‌ను ఒకసారి సందర్శించాలని వారిని కోరుతున్నా. ఇక్కడ భారతీయ, చైనా వంటకాలు అందిస్తున్నాం. "
- కాంతా ప్రసాద్, బాబా కా దాబా యజమాని
ఇదీ చూడండి: వృద్ధ దంపతుల కష్టాలు తీర్చిన వైరల్ వీడియో