చనిపోయిన కుమార్తె అంత్యక్రియలకు సాయం చేయాలని కోరుతూ మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకొని రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగింది ఓ మహిళ. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగింది. కట్టుకున్న భర్తతో పాటు కన్న వారు సైతం దూరం పెట్టిన ఆ మహిళ గురించి తెలుసుకున్న అధికారులు.. చిన్నారి అంత్యక్రియలకు ముందుకొచ్చారు. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కలిసి.. కాంకేర్ ముక్తిధామ్‌లో మృతదేహాన్ని ఖననం చేశారు.
నాలుగేళ్లలో అంతా తారుమారు..
మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో ఆనందంగానే జీవించేది. రెండేళ్ల క్రితం ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆమె జీవితం తలకిందులైంది. మహిళకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. భర్త చికిత్స చేయించకపోగా.. ఆమెతో గొడవలు పెట్టుకున్నాడు. దీంతో మహిళ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ ప్రభావం చిన్నారిపైనా పడింది. బాలికకు పోషకాహార లోపం ఏర్పడింది. మహిళ భర్త సైతం పనికి వెళ్లడం మానేశాడు. రోజూ ఆమెతో గొడవలు పెట్టుకునేవాడు. చివరకు ఆమెను దూరం పెట్టాడు. వీటన్నిటి వల్ల మహిళకు మానసిక సమస్యలు తలెత్తాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది.
చర్చికి వెళ్లిందని పుట్టింటివారికి కోపం..
మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళకు క్రైస్తవ వర్గానికి చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. చర్చికి వెళ్లడం ప్రారంభించిన తర్వాత తనకు మానసిక సమస్యలు తగ్గిపోయినట్లు మహిళ తెలిపింది. అయితే, చర్చికి వెళ్లడం ఇంట్లో వారికి నచ్చలేదు. దీంతో మేనమాన ఆమెను బయటకు వెళ్లగొట్టాడు. రెండు కుటుంబాలు దూరం పెట్టేసరికి.. చిన్నారిని వెంటబెట్టుకొని బయటకు వచ్చేసింది.
మహిళ కుమార్తె మరోసారి అనారోగ్యానికి గురైంది. సరైన చికిత్స అందించకపోవడం వల్ల ఫిబ్రవరి 4న (శనివారం) ఉదయం 8 గంటలకు చిన్నారి మరణించింది. అప్పటికే కూతురు పోయిన బాధలో ఉన్న మహిళకు.. చిన్నారి అంత్యక్రియలు ఎలా చేయాలో పాలుపోలేని పరిస్థితి. చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో కుమార్తె మృతదేహాన్ని వెంటబెట్టుకొని శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి వరకు సాయం కోసం ఇంటింటికీ తిరిగింది. చివరకు ఈ విషయం తెలుసుకున్న కాంకేర్ జిల్లా అధికారులు.. పోలీసులు, స్థానిక మున్సిపాలిటీ సహకారంతో అంత్యక్రియలు జరిపించారు. బాధిత మహిళను 'సఖి సెంటర్'కు తరలించారు. మహిళ ఇరు కుటుంబాలతో మాట్లాడతామని, ఆమెను ఇంటికి తీసుకెళ్లేలా ఒప్పిస్తామని పోలీసులు చెప్పారు.