దేశంలో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు నూతన పార్లమెంట్ భవనం అవసరమా? అని తమిళ విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. మరికొద్ది నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ముందు కమల్.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉన్నప్పుడు భారీ వ్యయంతో నూతన పార్లమెంట్‌ను నిర్మించడం ఎందుకు? అని ప్రశ్నించారు.
"కరోనా వైరస్ కారణంగా జీవనోపాధి కోల్పోయి దేశంలోని సగం మంది ప్రజలు ఆకలితో బాధపడుతుంటే రూ.1000 కోట్లతో నూతన పార్లమెంట్‌ను నిర్మించాల్సిన అవసరం ఏముంది? ప్రజలను రక్షించేందుకే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించాం అని ఆ దేశ పాలకులు పేర్కొన్నారు. కానీ ఆ గోడను నిర్మిస్తున్న క్రమంలోనే వేలాదిమంది కార్మికులు మరణించారు. ఇప్పుడు ఎవరిని రక్షించేందుకు నూతన పార్లమెంట్‌ను నిర్మిస్తున్నారు? గౌరవనీయులైన ప్రధాని సమాధానం చెప్పాలి"
-కమల్ హాసన్
ప్రచార పర్వం షురూ
వచ్చే ఏడాది మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో కమల్ హాసన్ మదురై నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అవినీతి, నిరుద్యోగం, గ్రామాభివృద్ధి, తాగు నీరు తదితర అంశాలను లేవనెత్తుతూ ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. 'తమిళనాడు ఇంకా వెనకబడే ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రచారాన్ని ప్రారంభించనున్నాం' అని కమల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా