Avonash reddy : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. హైకోర్టులో నేటి విచారణ జాబితాలో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ చివరలో ఉండగా.. త్వరగా విచారణ జరపాలని అవినాష్ తరఫు న్యాయవాది న్యాయమూర్తిని కోరారు. కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతి ఇంకా అందలేదని అవినాష్ న్యాయవాది తెలపగా.. ఉత్తర్వుల ప్రతి లేకుండా విచారణ ఎలా జరుగుతుందని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకే తదుపరి విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
పులివెందుల చేరుకున్న అవినాష్ రెడ్డి... మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. పులివెందులలో తన నివాసానికి వచ్చిన అవినాష్ రెడ్డి.. పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుంటున్నారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై విచారణ రేపటికి వాయిదా.. ఇక.. వివేకా హత్య కేసులో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది తెలపగా.. బెయిల్ రద్దుకు బలమైన కారణాలేమీ లేవని ఎర్రగంగిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పారు. వాదనల అనంతరం ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
జాగ్రత్తగా ఉండాలని దస్తగిరికి సూచన... హై కోర్టు తీర్పు నేపథ్యంలో పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు.. వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇంటికి వెళ్లారు. దస్తగిరికి ఉన్న భద్రతపై ఆరా తీసి.. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా తెలియజేయాలని సీబీఐ అధికారులు సూచించారు.
లేఖపై ఆరా.. వివేకా హత్య కేసులో మూడు రోజుల క్రితం విచారణకు హాజరైన రాజశేఖర్ రెడ్డి.. ఇవాళ మరోసారి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వివేకా హత్య, తదనంతర పరిణామాల గురించి సేకరిస్తున్న సీబీఐ... వివేకా రాసిన లేఖ గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. లేఖను సాయంత్రం వరకు ఎందుకు దాచిపెట్టారని రాజశేఖర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.
ఇవీ చదవండి :