MP Avinash CBI Inquiry Postponed: మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చుతూ.. ఐదోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రమ్మని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అవినాష్ పిటిషన్‌పై విచారణను మధ్యాహ్నం చేపడతామని హైకోర్టు స్పష్టం చేయడంతో.. సీబీఐ విచారణా రేపటికి వాయిదా పడింది.
ఈ క్రమంలో అవినాష్ విచారణపై సీబీఐని హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. ఎంపీ అవినాష్‌ను నేడు అరెస్టు చేయకుండా ఆగగలరా.. అని ప్రశ్నించగా.. అవినాష్ విచారణకు సాయంత్రం 5 గంటల వరకు ఆగుతామని హైకోర్టుకు సీబీఐ సమాధానమిచ్చింది. ఈలోపే అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. అవినాష్‌రెడ్డిని తొలుత మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రమ్మన్న సీబీఐ.. ముందస్తు బెయిల్ పిటిషనపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడటంతో.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీబీఐ విచారణ జరపనుంది. బెయిల్ సీఆర్‌పీసీ 160 కింద అతనికి నోటీసు ఇచ్చింది. ఈ నోటీసును వాట్సప్ ద్వారా అవినాష్‌కు సీబీఐ అదనపు ఎస్పీ ముకేశ్ శర్మ పంపించారు. సీబీఐ నోటీసులు అందడంతో విచారణకు బయల్దేరిన అవినాష్ దారిలోనే వెనుదిరిగి.. తిరిగి తన నివాసానికి వెళ్లారు.
వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్ పిటిషన్: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ వేసిన పిటిషన్‌లో తన వాదనలు కూడా వినాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై ఈరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్‌పై జస్టిస్ సురేందర్ విచారణ చేపట్టనున్నారు.
ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పలు కీలక అంశాలు: ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పలు విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవీ చదవండి: