భారత సర్వోన్నత న్యాయపీఠాన్ని తెలుగుతేజం జస్టిస్ నూతల పాటి వెంకట రమణ అధిష్ఠించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణతో ప్రమాణం చేయించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు జస్టిస్ రమణ ఆ పదవిలో కొనసాగనున్నారు.
55 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్ఠించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ కీర్తికెక్కారు. గతంలో రాజమహేంద్రవరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
జస్టిస్ రమణ .. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తమ పదవీ విరమణకు నెలరోజులముందే తదుపరి సీజేఐ పేరును.. కేంద్రానికి ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్.వి. రమణ పేరును.. మార్చి 24న జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. సీజేఐ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ.. కేంద్ర హోంశాఖకు పంపింది. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరగా.. రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.
రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ.. భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణను నియమిస్తూ ఈనెల 6న ఉత్తర్వులు జారీచేసింది. ఇవాళ ఆయన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ ఎన్.వి రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు.
ఇవీ చూడండి: