Justice For War Widow Of 62 War: యుద్ధంలో అమరుడైన భర్త పింఛన్ కోసం 56 ఏళ్లు పోరాడిన మహిళ ఎట్టకేలకు విజయం సాధించింది. బాధితురాలికి 6శాతం వడ్డీతో మొత్తం పెన్షన్ చెల్లించాలని ఛండీగఢ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆనందం వ్యక్తం చేసింది జవాన్ భార్య.
అసలేం జరిగిదంటే: 1962 ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందాడు పర్తాప్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్. ఆ తరువాత ప్రభుత్వం పింఛను ఆయన భార్య ధర్మోదేవికి ఇచ్చేది. అకస్మాత్తుగా 1966వ సంవత్సరం నుంచి పెన్షన్ ఆపేసింది కేంద్రం. దీంతో బాధితురాలు ఛండీగఢ్ హైకోర్టును ఆశ్రయించింది. 56 ఏళ్లపాటు సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. జస్టిస్ హర్సిమాన్ సింగ్ సేఠీ ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. 1966 నుంచి బాధితురాలికి రావాల్సిన పింఛను బకాయిల్ని 6శాతం వడ్డీతో చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు వాదనల సందర్భంగా.. నిర్దిష్ట కారణం లేకుండానే పింఛను నిలిపివేశారని.. బాధితురాలు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆమె తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పెన్షన్‌ను ఆపేయడం తమ ఉద్దేశం కాదని.. సమాచారం లోపం వల్లే ఇలా జరిగిందని హైకోర్టుకు కేంద్రం, సీఆర్ఫీఎఫ్ తెలిపాయి. 56 ఏళ్లుగా చట్టబద్ధమైన హక్కులను బాధితురాలు కోల్పోయిందని.. దీంతో అప్పటి నుంచి రావాల్సిన ఇతర అలవెన్సులు పొందేందుకు ఆమె అర్హురాలని బాధితురాలి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. విచారణ అనంతరం.. అమరవీరుడు జవాన్ భార్యకు భత్యాలతో సహా పెన్షన్‌ను పునరుద్ధరించాలని హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: 'ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ సిద్ధం'