సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సిబ్బంది ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రోజుల పాటు ఆయన కేసుల విచారణలో పాల్గొనకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో దేశంలో కరోనా పరిస్థితులపై సుప్రీం కోర్టు సుమోటోగా చేపట్టిన విచారణ వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సుమోటో విచారణకు బ్రేక్?
దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ విధానం, ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై పలుమార్లు విచారించిన ధర్మాసం.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం ఆయనకు కరోనా సోకడంతో ఈ విచారణ మరో తేదీకి వాయిదా పడనున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కేంద్రం ఇటీవల 218 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. నిపుణులు, శాస్త్రీయ సలహాల ఆధారంగానే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించామని, దీనిపై న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది.
ఇవీ చదవండి: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కన్నుమూత