అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ్ బంగాలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. గత నెల భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రంలో పర్యటించారు. నడ్డా పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్‌పై దాడి జరగడం వివాదానికి తెరలేపింది. ఆ సంఘటన జరిగిన దాదాపు నెల రోజుల తర్వాత నడ్డా మరోసారి బంగాల్‌కు వెళ్లనున్నారు.
జనవరి 9న బంగాల్‌లోని బీర్భూమ్‌లో నడ్డా పర్యటించనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా ఆయన రోడ్‌షోలో పాల్గొననున్నట్లు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భాజపా సీనియర్ నేతలతో నడ్డా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. నడ్డా పర్యటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా.. బంగాల్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జనవరి మూడో వారంలో షా పర్యటన ఉండనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
డిసెంబరు 10న కోల్‌కతా సమీపంలో జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా నడ్డా వాహనశ్రేణిని కొందరు ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఘటనకు తృణమూల్ కార్యకర్తలే కారణమని భాజపా ఆరోపించింది. ఈ దాడితో కేంద్రం, మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య మరోసారి చిచ్చు రాజుకుంది.
ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు అమిత్ షా కూడా బంగాల్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే తృణమూల్ కీలక నేత అయిన సువేందు అధికారి దీదీకి గట్టి షాకిస్తూ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పలువురు తృణమూల్ ఎమ్మెల్యేలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో పశ్చిమ్ బంగాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రంపై భాజపా దృష్టిపెట్టింది. బంగాల్‌లో పాగా వేసేందుకు కట్టుదిట్టమైన వ్యూహరచన చేస్తోంది. కీలక నేతలను రంగంలోకి దింపుతోంది.