దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించడానికి కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణలోని హైదరాబాద్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలు సహా.. మొత్తం 41 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
'సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూసెట్)'గా పిలిచే ఈ పరీక్షను తొలిసారిగా..ఈ ఏడాది జూన్ ఆఖరులో నిర్వహించే అవకాశం ఉందని ఆ అధికారి వెల్లడించారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కాకుండా జులైలోనే పరీక్ష ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. రెండు భాగాలుగా ఉండే ఈ పరీక్షకు హాజరు కాగోరు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ప్రశ్నాపత్ర రూపకల్పన ఇలా..
'సెక్షన్-ఏ'లో రీడింగ్ కాంప్రహెన్షన్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ తదితర అంశాలపై 50 ప్రశ్నలుంటాయి. 'సెక్షన్-బీ'లో డొమైన్ సంబంధిత ప్రశ్నలు 50 ఉంటాయి. 'నూతన జాతీయ విద్యావిధానం 2020'లో భాగంగా సీయూసెట్‌ను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: మూడు రోజుల పిల్లవాడు.. 8వ తరగతి పాస్!