JNU rape attempt: దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఓ పీహెచ్డీ విద్యార్థినిపై లైంగిక దాడి యత్నం జరిగింది. క్యాంపస్ ఆవరణలోనే విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత 12.45 నిమిషాలకు వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌కు ఈ మేరకు ఫిర్యాదు అందిందని చెప్పారు. దీంతో వసంత్ కుంజ్ నార్త్ స్టేషన్ హౌస్ అధికారి, డీసీపీ గౌరవ్ శర్మ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.
PhD student molested JNU campus
'పీహెచ్డీ చదువుతున్న యువతి సోమవారం రాత్రి 11.45 గంటలకు క్యాంపస్‌లో నడుస్తూ వెళ్తోంది. యువతి యూనివర్సిటీ తూర్పు గేట్ సమీపంలో ఉన్నప్పుడు ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి యువతిని వేధించడానికి ప్రయత్నించాడు. యువతి తోటివారిని అప్రమత్తం చేయగానే.. నిందితుడు పారిపోయాడు' అని గౌరవ్ శర్మ వెల్లడించారు.
వసంత్ కుంజ్ నార్త్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
బాలికపై హత్యాచారం.. నదిలో మృతదేహం..
Gwalior minor gang rape: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలని చంపేసి.. చంబల్ నదిలో పడేశారు. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
'నిందితుల్లో ఒకరితో బాధితురాలికి పరిచయం ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు వెళ్తున్నామని, తమతో కలిసి రావాలని బాలికను ఓ నిందితుడు కోరాడు. ఫరూఖాబాద్ నుంచి తిరిగి వస్తుండగా.. యువతిని హత్య చేసి చంబల్ నదిలో పడేశారు. బాలికపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు బెదిరించడం వల్ల.. ఆమెను చంపేశారు' అని జిల్లా ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని వెల్లడించారు. ఇందుకోసం నదిని జల్లెడ పడుతున్నామని చెప్పారు. నిందితులు వాడిన ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.
వృద్ధ దంపతుల హంతకుడు అరెస్ట్
Crime News Madhya Pradesh: క్షుద్రపూజలు చేస్తున్నారన్న కారణంతో వృద్ధ దంపతులను హత్య చేసిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని దయారామ్ కులస్తేగా గుర్తించారు.
ఆ రాష్ట్రంలోని జబల్పుర్ జిల్లా చౌరాయి గ్రామంలో జనవరి 9 అర్ధరాత్రి.. సుమేర్ సింగ్ కులస్తే, అతడి భార్య సియాబాయిని దయరామ్ చంపేశాడు. ఇరువురినీ పదునైన ఆయుధంతో హత్య చేసి.. వారి మృతదేహాలకు నిప్పంటించాడు. 'తన సోదరుడి ఆత్మహత్యకు ఈ దంపతుల క్షుద్రపూజలే కారణమని నిందితుడు భావించాడు. అందుకే దంపతులను హత్య చేశాడు. దీంతోపాటు.. తన తండ్రి ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడన్న భావనతో సుమేర్ సింగ్‌పై కక్ష పెంచుకున్నాడు' అని పోలీసులు వివరించారు.
మాస్టారు గలీజ్ పని...
మధ్యప్రదేశ్‌లోని షియోపుర్‌లో ఓ స్కూల్ టీచర్.. విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశాడు. ఆన్లైన్ క్లాస్‌ల విద్యార్థులు, తల్లిదండ్రుల నంబర్లతో రూపొందించిన గ్రూప్‌లో ఈ చిత్రాలను షేర్ చేశాడు. నిందితుడిని ఇన్సాఫ్ మహమ్మద్‌గా గుర్తించారు. కిలా షియోపుర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అతడు పనిచేస్తున్నాడని జిల్లా విద్యాధికారి ఎస్కే సోలంకి తెలిపారు. ఎంపీ సివిల్ సర్వీసెస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
బార్ యజమాని బొటనవేలిని కొరికి...
ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌పుర్‌లో బార్ యజమానికి, కస్టమర్‌కు మధ్య గొడవ జరిగింది. బిల్లు చెల్లించే విషయంపై యజమానితో ఘర్షణ పడ్డ సునీల్ కుమార్ అనే వ్యక్తి.. చివరకు బార్ ఓనర్ బొటనవేలిని కొరికేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బార్ యజమాని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: సూపర్ మార్కెట్లో 'గొడ్డలి'తో వీరంగం.. రెండు చాక్లెట్లతో పరార్!