JK Encounter: జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని రైనావారీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా సైన్యం తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద ప్రెస్ కార్డు ఉన్నట్లు కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. ఐడీ కార్డులో అతని పేరు రయీస్ అహ్మద్ భట్ అని, వ్యాలీ మీడియా సర్వీస్ అనే ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ చీఫ్ ఎడిటర్ అని ఉన్నట్లు విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై గతంలోనే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. మరో ఉగ్రవాదిని బిజ్‌బెహరాకు చెందిన హిలాల్ అహ్‌రాహ్‌గా గుర్తించారు.