Delimitation commission Jammu and Kashmir: శాసనసభ ఎన్నికల నిర్వహణకు వీలుగా జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన (డీలిమిటేషన్) కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. జమ్ములో అదనంగా 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి నేషనల్ కాన్ఫరెన్స్ సహా ఇతర పార్టీలు. భాజపా రాజకీయ అజెండాను అనుసరిస్తోందని ఆరోపించాయి. భాజపాకు మిత్రపక్షాలుగా భావించే పార్టీలు సైతం.. కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకించాయి.
7 అసెంబ్లీ స్థానాల పెంపు..
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ సోమవారం దిల్లీలో సమావేశమైంది. ఈ కమిషన్‌లో జమ్ముకశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా భారత ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సహా ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు.
ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్ములో 37 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి అదనంగా జమ్ములో 6, కశ్మీర్లో 1 అసెంబ్లీ స్థానాన్ని పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. అలాగే ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించింది.
సీట్ల పెంపుపై తమ అభిప్రాయాలను డిసెంబర్ 31లోపు తెలపాలని పార్టీలకు కమిషన్ సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
విపక్షాల గుర్రు..
కమిషన్ భేటీ అనంతరం మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా.. సీట్ల పెంపు ప్రతిపానదనపై ఐదు పార్టీల గుప్కార్ అలయన్స్, తమ పార్టీ నేతలకు వివరిస్తానని చెప్పారు.
" జమ్ముకశ్మీర్ ప్రజల గొంతుకను వినిపించే ఉద్దేశంతోనే తొలిసారి ఈ సమావేశానికి హాజరయ్యాం. ఈ భేటీ సామరస్యంగా జరిగింది. సీట్ల పెంపుపై పలు విషయాలు కమిషన్‌కు వివరించాం. మా అభిప్రాయాలను తెలిపే ముందు సీనియర్ పార్టీ నేతలతో చర్చిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల గురించి మాకు చెప్పలేదు."
- ఫరూఖ్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి.
భాజపా అజెండాను అనుసరించారు..
డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన తమను నిరాశకు గురిచేసిందన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తమ పరిశీలనలోని డేటాకు బదులుగా భాజపా అజెండాలోని అంశాలనే పరిగణనలోకి తీసుకుందని ఆరోపించారు. హామీ ఇచ్చిన శాస్త్రీయ విధానానికి ఇది విరుద్ధంగా, రాజకీయ చర్యలా ఉందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. జమ్ముకు 6, కశ్మీర్‌కు కేవలం ఒకే స్థానం ఇవ్వటం 2011 జనాభా లెక్కల ప్రకారం జరగలేదన్నారు ఒమర్.
ముసాయిదాపై ఎన్సీ సంతకం చేయదు: డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికపై నేషనల్ కాన్ఫరెన్స్ సంతకం చేయబోదని స్పష్టం చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి. దురుద్దేశంతో వాస్తవాలను తప్పుగా చూడటం, వక్రీకరించటం తప్పుదోవ పట్టించటమేన్నారు. కమిషన్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పామని, దానిని వక్రీకరించారని ఆరోపించారు.
తిరస్కరించిన జేకే అప్నీ పార్టీ
కమిషన్ ప్రతిపాదనలను తిరస్కరించారు జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుకాహ్రి. ఆమోద యోగ్యంగా లేదన్నారు. జనాభా, జిల్లాల ఆధారంగా పునర్విభజన సక్రమంగా జరగాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఏర్పాటే అసలు నిజం
ప్రజలను మతాల, ప్రాంతాల పేరుతో విభజించి భాజపా రాజకీయ ప్రయోజనాలను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిందే డీలిమిటేషన్ కమిషన్ అని ఆరోపించారు పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. దాని వెనకున్న అసలు నిజం.. జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమేనన్నారు. 2019, ఆగస్టులో రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను చట్టబద్ధం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కమిషన్‌పై ముందు నుంచి ఉన్న తన భయాలు వమ్ము కాలేదని గుర్తు చేసుకున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా చేపట్టిన సీట్ల కేటాయింపును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
ఆమోదయోగ్యం కాదు: పీసీ
డీలిమిటేషన్ కమిషన్ చేసిన ప్రతిపాదనలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జాద్ లోన్. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారికి ఇది షాక్ అని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: డీలిమిటేషన్ కమిషన్‌తో భేటీకి పార్టీలన్నీ సుముఖం!