జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ సజావుగా సాగిందని అధికారులు తెలిపారు. అవాంఛిత ఘటనలేవీ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.51 శాతం పోలింగ్ నమోదైంది. జమ్ములో పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు.. ఓటింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఉదయం భారీగా పొగమంచు కమ్మేసినప్పటికీ ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు.
అయితే కశ్మీర్ డివిజన్లో.. ఓటింగ్ తక్కువగానే నమోదైంది. పుల్వామా, షోపియాన్లో పోలింగ్ శాతం రెండంకెలకు మించలేదని తెలుస్తోంది. కశ్మీర్లో ఇటీవల భారీ మంచువర్షం కురవడం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఓటింగ్ శాతం తగ్గడానికి ఇదో కారణంగా తెలుస్తోంది.
31 స్థానాలు- 245 మంది అభ్యర్థులు
18 జిల్లాల్లో ఉన్న మొత్తం 31 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. 245మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొత్తం 2,071 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిర్వహించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 77 సర్పంచ్ స్థానాలకు కూడా ఆదివారమే పోలింగ్ జరిగింది. ఈ స్థానాలకు 229 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.