జమ్ము కశ్మీర్ స్థానిక ఎన్నికల సమరం నేటితో ముగియనుంది. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) స్థానాలకు చివరి, ఎనిమిదో విడత ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 28 స్థానాలకు 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6.30 లక్షల మంది ప్రజలు పోలింగ్లో పాల్గొననున్నారు.
కశ్మీర్ డివిజన్లో 13, జమ్ము డివిజన్లో 15 డీడీసీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిపారు. 1,703 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వీటితో పాటు 28 డీసీసీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 285 పంచ్, 84 సర్పంచ్ స్థానాలకు సైతం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు శర్మ. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.