అమెరికా దళాల నిష్క్రమణతో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించడం పట్ల అక్కడి ప్రజలు సంతోషంగానే ఉన్నట్లు ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ అన్నారు. జమ్తారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. 'అఫ్గానిస్థాన్‌లో అంతా బాగుంది. తాలిబాన్ల రాకతో అఫ్గాన్ ప్రజలు సంతోషంగా ఉన్నారు' అని మీడియా సమావేశంలో వెల్లడించారు.
అఫ్గాన్‌లో అమెరికా పాత్రపైనా అన్సారీ స్పందించారు. అఫ్గాన్ వ్యాప్తంగా అగ్రరాజ్యం అకృత్యాలకు పాల్పడిందని దుయ్యబట్టారు.
"అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాలు ఎన్నో దారుణాలకు ఒడిగట్టాయి. మహిళలు, పిల్లలను అగ్రరాజ్య దళాలు వేధించాయి. ఇప్పుడు అఫ్గాన్ దేశం, తాలిబన్లు సంతోషంగా ఉన్నారు."
-కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ
మీరు తాలిబన్లకు మద్దతు ఇస్తున్నారా అని అడగ్గా.. ప్రజలు అన్యాయాలను ఎదుర్కొంటున్నప్పుడు తాను కచ్చితంగా అండగా ఉంటానని బదులిచ్చారు.
అయితే అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. తాలిబన్ల క్రూర పాలన నుంచి తప్పించుకునేందుకు.. అఫ్గాన్ ప్రజలంతా కాబుల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారని.. దొరికిన విమానాన్ని పట్టుకొని కట్టుబట్టలతోనైనా దేశాన్ని వీడేందుకు వారు ప్రయత్నిస్తున్న తీరును ప్రపంచమంతా గమనిస్తోందని భాజపా మండిపడింది. అన్సారీ వ్యాఖ్యలు తాలిబన్ల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని ఆక్షేపించింది.
ఇవీ చదవండి: