JEE Mains Exam 2022: జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే రెండు సార్లు తేదీలు ప్రకటించిన జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) మరోసారి షెడ్యూలు సవరించింది. ఈ నెల, వచ్చే నెల జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్, జులైలో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు.. జూన్ 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను జులై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థుల అభ్యర్థన మేరకే షెడ్యూలు మార్చినట్టు జాతీయ పరీక్షల సంస్థ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఉన్నందున విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలతో పాటు, జే ఈఈ అడ్వాన్స్డ్ అర్హత కోసం దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది జేఈఈ మెయిన్ పరీక్షలు రాయనున్నారు.
నీట్..
NEET Exam 2022: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష జులై 17న జరగనుంది. జులై 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి మే 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 543 నగరాలు, పట్టణాలతో పాటు.. వివిధ దేశాల్లోని 14 పట్టణాల్లో నీట్ నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది నుంచి నీట్ పరీక్షకు గరిష్ఠ వయో పరిమితి ఎత్తి వేశారు. భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాల్లో ఒక్కో సబ్జెక్టుకు 50 చొప్పున 200 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున 200 నిమిషాలు పరీక్ష సమయం గా ఎన్టీఏ నిర్ణయించింది. ప్రతీ ఏటా దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు.
ఇదీ చదవండి: క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం