దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పుర్ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో సోమవారం భర్త ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించిన కొద్దిసేపటికే రాజ్‌కుమారి మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చి వారింటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెకు కొవిడ్ సోకినట్లు కూడా వైద్యులు వెల్లడించలేదు.
అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు వృద్ధుడికి గ్రామస్థులు సాయం చేయాల్సింది పోయి.. ఎవరూ ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. గ్రామంలోని శ్మశానవాటికలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకూడదని తెగేసి చెప్పేశారు. ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఆ వృద్ధుడు సైకిల్ మధ్యలో భార్య మృతదేహాన్ని ఉంచి గంటల కొద్దీ తిరిగాడు. దిక్కు తోచని స్థితిలో రోడ్డు పక్కన ఆగి గుండెలవిసేలా రోధించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక అధికారులపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న జౌన్‌పుర్ పోలీసులు రాజ్‌కుమారి మృతదేహానికి రామ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
మరో ఘటన...
ఒడిశా బొలాన్గిర్ జిల్లా భలుదుంగురి గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తండ్రి మరణించగా.. అంత్యక్రియలకు ఎవరూ రాకపోవటం వల్ల మృతదేహాన్ని సైకిల్‌పైనే తీసుకెళ్లాడు కొడుకు. ఖప్రఖోల్ ఆరోగ్య కేంద్రంలో కొవిడ్-19కు చికిత్స పొందుతూ అయోధ్య సాహూ అనే వ్యక్తి మరణించాడు. వైరస్ భయంతో బంధువులు, గ్రామస్థులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో చేసేది ఏమీ లేక.. మృతదేహాన్ని పాలిథీన్ కవర్లలో పెట్టి రెండు కిలోమీటర్లు సైకిల్ తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో ఖననం చేశాడు.
ఇదీ చూడండి: 3వేల మంది కొవిడ్ బాధితులు ‘మిస్సింగ్’