Japan PM in India: రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా.. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం భేటీ అయ్యారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలే ఎజెండాగా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం.. 14వ భారత్- జపాన్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు కిషిడా. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అండ్ కార్పొరేషన్ విభాగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.
"భారత్-జపాన్ల మధ్య ఆర్థిక భాగస్వామ్యం వృద్ధి చెందుతోంది. భారత్‌లోని అతిపెద్ద పెట్టుబడిదారుల్లో జపాన్ ఒకటి. హైస్పీడ్ ప్రాజెక్టుపై ఇరు దేశాలు వన్ నేషన్-వన్ ప్రాజెక్ట్ అన్నట్టు కృషి చేస్తున్నాయి. స్థిరత్వం, సురక్షితమైన విద్యుత్ పంపిణీ ప్రాముఖ్యత ఇరు దేశాలకు తెలుసు. ఆర్థిక వృద్ధికి, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇది ఎంతో అవసరం."
-ప్రధాని నరేంద్ర మోదీ
"ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జపాన్-భారత్‌ల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల గురించి చర్చించుకున్నాం. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం అవసరం. ఇండో-పసిఫిక్పైన ఇరు దేశాలు మరింత కృషి చేయాలి. భారత్ సహకారంతో ఉక్రెయిన్ సహా సరిహద్దు దేశాలకు సహకారం అందించడం.. రష్యా దాడులను ఆపేందుకు జపాన్ కృషి చేస్తుంది."
-ఫుమియో కిషిడా, జపాన్ ప్రధాని
రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా.. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు ఐదు ట్రిలియన్ యెన్‌ల (సుమారు రూ.3.20 లక్షల కోట్లు) పెట్టుబడిని ప్రకటించారు. 2014లో అప్పటి ప్రధాని షింజో అబే ప్రకటించిన 3.5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులకు ఇవి అదనమని పేర్కొంది.
భారత్‌లో పట్టణ మౌలిక సదుపాయాలు సహా బుల్లెట్ రైలు సాంకేతికత ఆధారిత వేగవంతమైన రైల్వే ప్రాజెక్టులకు జపాన్ ఇప్పటికే సహకారం అందిస్తోంది. 300 బిలియన్ యెన్ల రుణం, కర్బనరహిత ఇంధన స్వయంసమృద్ధిలో సహకారం వంటి వాటిపైనా కిషిడా కీలక ప్రకటన చేశారు.
పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.40 గంటలకు భారత్ చేరుకున్నారు కిషిడా. దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. భారత పర్యటన అనంతరం కంబోడియా వెళ్లనున్నారు. భారతకు వచ్చే ముందు ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు కిషిడా. రష్యా చర్య ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి సంఘటలను ఇండో పసిఫిక్ ప్రాంతంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : తిహార్ జైలులో 2,400 మంది ఖైదీలు మిస్సింగ్!