దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. 10 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లో జనతా కర్ఫ్యూ విధించారు. భోపాల్ నగరం నిర్మానుష్యంగా మారింది. దుకాణాలు మూతపడ్డాయి. రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.



దిల్లీలో కరోనా నిబంధనల దృష్ట్యా జామా మసీదు ప్రాంతంలోనూ సందడి లేకుండాపోయింది. ఈ రంజాన్ పవిత్ర మాసం మొదటి రోజునే మసీదు వద్ద దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండి ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తున్నారు.


మహారాష్ట్రాలో కర్ఫ్యూ విధించిన కారణంగా వలస కూలీలు సొంత ఊళ్లకు తిరుగు పయణమయ్యారు. రైళ్ల కోసం ముంబయిలోని లోకమాన్య తిలక్ సర్కిల్ వద్ద పెద్దఎత్తున జనం గుమిగూడారు. వారిని అదుపుచేయడానికి అదనపు భద్రతా సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.

జనం భయాందోళనలకు గురికావద్దని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ.. గత అనుభవాలను దృష్టిలోపెట్టుకుని సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నామని వలస కూలీలు తెలిపారు.

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తయారీదారుల నుంచి తీసుకురావటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు సరఫరాదారులు.


కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొవిడ్ పరీక్షల్లో జాప్యం కాకుండా అహ్మదాబాద్‌లో వినూత్నంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణంలో ఉండగానే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ప్రయాణికులు కార్లలో ఉండగానే నమూనాలు తీసుకుని 24 గంటల్లో ఫలితాలను మొబైల్ నంబర్‌కు పంపిస్తున్నారు.


ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం: దేశంలో మరో 1,84,372 కేసులు