PAWAN DELHI TOUR UPDATES: పోలవరం నిర్మాణ విషయంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. తక్షణమే చొరవ తీసుకుని ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంతులు గజేంద్రసింగ్ షెకావత్, మురళీధరన్‌తో సమావేశమైన జనసేనాని.. పోలవరం సహా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇవాళ బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డాను పవన్ కలవనున్నట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీలో విదేశాంగ శాఖ సహాయమంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను మురళీధరన్‌కు వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ షెకావత్‌కు వినతిపత్రమిచ్చారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి సోమవారం దిల్లీ వెళ్లిన జనసేనాని.. తొలుత మురళీధరన్‌తో అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుతెన్నులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలుగా తమ లక్ష్యంపై పవన్, మురళీధరన్ చర్చించినట్లు తెలిసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలోనూ వైసీపీ ఓటమి చెందడం, జనసేన, బీజేపీ పొత్తు క్షేత్రస్థాయిలో ఫలించలేదన్న బీజేపీ అభ్యర్థి మాధవ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీతో సంబంధాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకు వ్యతిరేకంగా ప్రజలు ఎలా స్పందించారు? ఉమ్మడిగా జనసేన- బీజేపీ వ్యూహం ఎలా ఉండాలన్న కోణంలో వీరి చర్చలు సాగినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల దాడి, దానిపై బీజేపీ అధిష్ఠానం దృష్టి కోణం వీరి మధ్య చర్చకు వచ్చిందని సమాచారం.
ఆ తర్వాత కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ చూపాలని కోరారు. బహుళ ప్రయోజనాలు ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమని, నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. విశాఖ పారిశ్రామిక జోన్‌తో పాటు, విశాఖ నగర వాసులకు తాగునీటి అవసరాలు తీర్చాల్సిన పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిగా నిలిచిపోయాయని మంత్రి దృష్టికి పవన్ తీసుకెళ్లారు. ప్రాజెక్టు కట్టలేక.. వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నెపం నెడుతోందని.. 2019 మే నాటికి 72 శాతానికిపైగా పూర్తయితే, గత నాలుగేళ్లలో కనీసం మూడు శాతం పనులైనా చేయలేదని పేర్కొన్నారు. మిగిలిన 24 శాతం పనుల పూర్తికి కేంద్రం చొరవ చూపాలని పవన్ కోరారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించారు.
ఇవీ చదవండి: