JanaSena Chief Pawan Kalyan Meet with Chandrababu: జూబ్లీహిల్స్‌లోని తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బెయిల్ పై విడుదలైన ఆయనను పవన్ కల్యాణ్ పరామర్శించారు. దాదాపు 2 గంటలపాటుగా... చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికలు, ఏపీలోని తాజా రాజకీయాలపై మాట్లాడారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు-పవన్ చర్చించారు. వివిధ అంశాలతో మినీ, ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం - జనసేన నిర్ణయం తీసుకోనుంది.
పలు అంశాలపై చర్చ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య జరిగిన దాదాపు రెండున్నర గంటల భేటిలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధనంగా చర్చకు వచ్చాయి. షణ్ముఖ వ్యూహం పేరిట జనసేన తరపున ఆరు అంశాలను పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ప్రతిపాదించిన్నట్లు తెలుస్తోంది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక రూపకల్పనను సూచించిన్నట్లు సమాచారం. అమరావతిని రాజధాని గా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన్నట్లు తెలుస్తోంది. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, లేక ఇళ్ల మరమ్మతులకు చేసుకోవాలన్న ఉచితంగా ఇసుక పంపిణీ చేయటం, దాదాపు 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ పై చర్చించిన్నట్లు సమాచారం. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా 10లక్షల రూపాయల చొప్పున సాయం అందించి, తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళికలను పవన్ కల్యాణ్ ప్రతిపాదించిన్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయం - బంగారు ఫలసాయం: వ్యవసాయం - బంగారు ఫలసాయంపేరిట ఉద్యాన రైతులకు 5వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటంతో పాటు, ఆ పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహించాలని నిర్ణయించారు. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయ ఇబ్బందులు లేకుండా చూడలని ప్రతిపాదించారు. మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ చేయటం, ప్రయివేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలను పవన్ ప్రతిపాదించారు. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు హామికి మేనిఫెస్టోలో చేర్చాలని సూచించిన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనలకు సానుకులంగా స్పందించిన చంద్రబాబు త్వరలోనే మరోసారి సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం.