ఎన్కౌంటర్ మధ్యలో ఉగ్రవాదులు జరిపిన పేలుడు కారణంగా ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా కండి అడవిలో శుక్రవారం జరిగిందీ ఘటన. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య పోరు కొనసాగుతోంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రాజౌరీ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
ఉదయం నుంచి ప్రత్యేక ఆపరేషన్..
గత నెలలో జమ్ములోని భాటా దురియన్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. నాటి ఘటనలో పలువురు జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి కారణమైన ముష్కరుల పనిబట్టేందుకు ఇండియన్ నార్తర్న్ కమాండ్ కొద్ది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సైన్యానికి కీలక సమాచారం అందింది.
నిఘా వర్గాల సమాచారంతో రాజౌరీ సెక్టార్‌లోని కండి అటవీ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళం.. కీలక ఆపరేషన్ చేపట్టింది. అడవిలో దాక్కున్న ముష్కరుల కోసం విస్తృతంగా గాలించింది. శుక్రవారం ఉదయం ఏడున్నరకు ఓ గుహలో కొందరు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
ఉగ్రవాదులు, సైనికులకు మధ్య శుక్రవారం పోరు మొదలైంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే.. గుహ లోపల దాగి ఉన్న ముష్కరులు.. అనూహ్యంగా పేలుడు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు మేజర్ ర్యాంక్ అధికారి.
ఉగ్రవాదుల దాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. ముష్కరులు ఉన్న ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను పంపింది. ముందుజాగ్రత్తగా రాజౌరీ జిల్లావ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపివేసింది. క్షతగాత్రుల్ని ఉధంపుర్లోని ఆస్పత్రికి తరలించింది. అయితే.. గాయపడ్డవారిలో ముగ్గురు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కాగా, ఏప్రిల్ 20న భాటా దురియన్ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గ్రెనేడ్లతో దాడి చేశారు. దీంతో వ్యాన్‌లో మంటలు చెలరేగి పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. సైనిక వాహనంపై ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. పూంచ్ జిల్లాలోని భాటా దొరియా ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో భద్రతా సిబ్బంది ముమ్మరంగా వెతికాయి. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, ఫూంచ్ జిల్లాలకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భింబర్ గాలి-పూంఛ్ మధ్య రాకపోకలను నిలిపివేసి వాహనాల దారి మళ్లించారు. ఎన్ఐఏ బృందం సైతం రంగంలోకి దిగింది.