ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులను తొలగిస్తున్న జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఫిరోజ్ అహ్మద్ లోన్, దక్షిణ కశ్మీర్ బిజ్‌బెహ్రాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ జావిద్ అహ్మద్ షాలను తొలగించింది. దీనితో ఈ ఏడాది తొలగించిన ఉద్యోగుల సంఖ్య 29కి చేరుకుంది. వీరంతా తీవ్రవాద సంస్థలతో కలసి పని చేశారనే ఆరోపణలున్నాయి.
- జైళ్ల శాఖలో 2007-08లో నియమితులైన అహ్మద్ లోన్.. కోర్టు కేసు అనంతరం 2012లో ఉద్యోగంలో చేరాడు. అయితే పలు అభియోగాలపై 2017లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకోగా.. అప్పటి నుంచి సస్పెన్షన్‌లో కొనసాగుతున్నాడు.
- ఇక 1989లో లెక్చరర్‌గా నియమితులైన జావిద్ అహ్మద్ షా.. అనంత్‌నాగ్‌లోని బిజ్‌బెహ్రాలోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌కి ప్రిన్సిపాల్‌గా ప్రమోట్ అయ్యాడు. ఆయన నిషేధిత తీవ్రవాద సంస్థ జమాత్-ఏ-ఇస్లామీకి సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాఠశాలలో పనిచేస్తూ.. హురియత్ కేడర్, జమాత్‌కు సలహాదారుగా ఉన్నట్లు ఆరోపించారు. అంతేగాక.. విద్యార్థినులకు ఇస్లామిక్ తీవ్రవాద సాహిత్యం బోధించేవాడనే అభియోగాలున్నాయి.
గత నెలలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ మనవడు అనీస్-ఉల్-ఇస్లామ్‌ను ప్రభుత్వం తొలగించింది. అంతకుముందు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారులను, ఉగ్రవాదులతో కలసి వెళ్తున్న డీఎస్పీ దేవేందర్ సింగ్‌ను సర్వీస్ నుంచి తొలగించింది.
ఇవీ చదవండి: