జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
బుధవారం ఉదయం శ్రీనగర్‌లోని మాల్హూరా, పారిమ్పోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగ్గా... ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఉగ్రమూకలు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టిన జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో రెండు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రి లభించినట్లు తెలిపారు.
రెండో ఎన్కౌంటర్
మరోవైపు, కుల్గాంలోని చిమ్మేర్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. మరింత మంది ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
నియంత్రణ రేఖ వద్ద..
రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవానుకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్ఓసీకి సమీపంలోని దాదల్ గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.