Jail Reforms Committee Report : భారత్‌లోని చెరసాలల్లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై సుప్రీంకోర్టు నియమించిన జైలు సంస్కరణల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో రద్దీ నివారణకు తక్షణం భారీ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. చిన్న కేసులకు కూడా కోర్టులు.. జైలు శిక్షలు వేయడాన్ని తప్పుపట్టింది. చట్టపరంగా ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నా నిర్బంధం వైపు మొగ్గు చూపడం సరికాదని పేర్కొంది.
కారాగారాలు కిటకిట అందుకే..
దర్యాప్తు, విచారణ ప్రక్రియల్లో జరుగుతున్న మితిమీరిన జాప్యంపైనా కూడా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వీరి కారణంగానే కారాగారాలు కిటకిటలాడుతున్నాయని నివేదికలో పేర్కొంది. దీనికి సమర్థవంతమైన పరిష్కారం.. వేగవంతమైన విచారణే అని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కారాగార పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం.. 2018లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అమితవ రాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. గురువారం ఈ కమిటీ తన నివేదిక సారాంశాన్ని సమర్పించింది.
జిల్లా జైళ్లు 148 శాతంతో..
2018 నవంబరు గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1341 సెంట్రల్ జైళ్లు, 644 సబ్ జైళ్లు, 402 జిల్లా జైళ్లలో 122 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉందని పేర్కొంది. అత్యధికంగా జిల్లా జైళ్లు 148 శాతంతో కిటకిటలాడుతున్నాయని తెలిపింది. విచారణ లేకుండా ఏళ్ల తరబడి కారాగారాల్లో మగ్గుతున్న ఖైదీల సంఖ్య భారీగా ఉందని ప్రస్తావించింది. ఈ సంఖ్యను అదుపులో ఉంచాలంటే న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని అభిప్రాయపడింది.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సిందే!
ఐదేళ్లు కన్నా పెండింగులో ఉన్న చిన్న కేసుల పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కమిటీ నివేదికలో తెలిపింది. మహిళా, ట్రాన్స్‌జెండర్ ఖైదీల పరిస్థితు, జైళ్లలో నానాటికీ పెరుగుతున్న బలవన్మరణాలపైనా కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సున్నిత విషయాల్లో సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కి చెప్పింది. 2017 నుంచి 2021 మధ్య 817 అసహజ మరణాలు నమోదయ్యాయని చెప్పింది. ఇందులో 660 బలవన్మరణాలు ఉన్నాయని పేర్కొంది. వీటిని నిరోధించాలంటే ఆత్మహత్య నిరోధక బ్యారక్‌లు, గదులను నిర్మించాలని కోరింది. ఇందుకు అనుగుణంగా నిర్మాణాల్లో మార్పులు చేయాలి అని సూచించింది.