Jagdeep Dhankhar nomination: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీప్ ధన్‌ఖడ్ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్ సభ సెక్రెటరీ జనరల్ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌కు ఆయన నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, రామ్‌దాస్ అథవాలే పాల్గొన్నారు. నామినేషన్ దాఖలకు ముందు జగదీప్ ధన్‌ఖడ్.. భాజపా సహా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు.
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కౌంటింగ్ అదే రోజు జరగనుంది.
"దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తా. నాలాంటి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకత్వానికి కృతజ్ఞతలు."
-జగదీప్ ధన్‌ఖడ్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి
న్యాయవాది.. ఎమ్మెల్యే.. ఎంపీ..: భారత దేశ రెండో అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికైన జగదీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌లోని.. ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. ఆయన కిసాన్‌పుత్ర అనే గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్తోడ్‌గఢ్ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందిన ధన్‌ఖడ్.. రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
ఇవీ చదవండి: 'వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిది'