Jagan Promises to Agri Gold Victims: నేను విన్నాను! నేను చూశాను! నేను న్యాయం చేస్తాను! ఇవీ అగ్రిగోల్డ్ బాధితులతో సీఎం జగన్ చెప్పిన మాటలు. అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారసభల్లో ఆదుకుంటామని ఊదరగొట్టిన జగనన్న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగానే అగ్రిగోల్డ్ అంశాన్నే అటకెక్కించారు. చెల్లించాల్సిన సొమ్ములో 22.87 శాతమే ఇచ్చి చేతులు దులుపుకుని బాధితులందర్నీ ఆదుకున్నట్లు ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు.
సగం మందికి పైగా బాధితులకు ఒక్క పైసా అందకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాము చెల్లించిన డబ్బులు ఇప్పించాలని అగ్రిగోల్డ్ బాధితులు వేడుకుంటున్నా 'నేను వినలేను' 'నేను చూడలేను' అన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారు. 2018 జనవరి 6న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో, జూన్ 5న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తణుకు బహిరంగ సభలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం జగన్
ఇలా అగ్రిగోల్డ్ బాధితుల బాధలు తీర్చుతామంటూ గద్దెనెక్కిన జగన్ తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సైతం బుట్టదాఖలు చేశారు. ఏదో మొక్కుబడిగా కొందరికి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. 2019 నవంబరు 7న గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికీ సొమ్ము చెల్లిస్తామన్న హామీ ఇచ్చారు. నాలుగేళ్లు దాటినా అది కార్యరూపం దాల్చలేదు.
అగ్గిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసినట్లుగా, అందరికీ కష్టాలు తీర్చినట్లుగా ఊదరగొడుతున్న జగనన్న మొత్తం సొమ్ములో ఇచ్చింది 22.87 శాతమే. దాదాపు సగం మందికి పైగా బాధితులకు ఒక్క పైసా కూడా అందలేదు. వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొత్తం సొమ్ము రూ.3వేల 957 కోట్లలో రెండు విడతలు కలిపి 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. రూ.20 వేలు, అంతకంటే తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారిలో కొందరికి చెల్లింపులు జరిపింది. ఈ కేటగిరిలో మొత్తం 13.50 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు. వీరందరికీ న్యాయం జరగాలంటే రూ.1,150 కోట్లు ఇవ్వాలి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రకరకాల కొర్రీలు వేసి బాధితులందరికీ సొమ్ము చెల్లించలేదు. ఈ కేటగిరిలోని 3లక్షల 10వేల మందికి ఇంకా రూ.244.43 కోట్లు ఇవ్వాలి.
20 వేలు, అంతకంటే ఎక్కువ మొత్తాలు డిపాజిట్ చేసిన బాధితులు 6లక్షల 50వేల మంది ఉన్నారు. వీరికి రూ.2వేల 800 కోట్లకు పైగా చెల్లించాలి. కానీ జగన్ ప్రభుత్వం అసలు ఆ ప్రస్తావనే తేవట్లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని పారదర్శకంగా వేలం వేసి ప్రతి పైసా బాధితులకు అందేలా చేస్తామని 2018 అక్టోబరు 8న విజయనగరం జిల్లా గుర్లలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పారు.
అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 90 శాతానికి పైగా స్థిర, చరాస్తులను టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోని 21వేల 642.78 ఎకరాల భూములు, 1,07,981.56 చదరపు గజాల స్థలాలు అప్పట్లోనే జప్తు చేశారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆ ఆస్తులు విలువ రూ.3వేల 869.72 కోట్లు కాగా వాటి మార్కెట్ ధర అంతకు అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ నాలుగన్నరేళ్లలో వాటిని వేలం వేసి బాధితులకు ప్రతి పైసా ఎందుకు చెల్లించలేకపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసుకున్న బాధితులు మోసపోవటంతో తీవ్ర మనోవ్యథ ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు ఆ వేదనతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 600 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని అగ్రిగోల్డ్ వినియోగదారుల సంక్షేమ సంఘం గుర్తించింది. ప్రాణాలు కోల్పోయిన బాధితులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని 2017 మార్చి 24న విజయవాడలోని అగ్రిగోల్డ్ బాధితుల దీక్షా శిబిరంలో జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ మృతుల కుటుంబీకులకు ఒక్క పైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా విస్మరించారు.