గతేడాది జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2020 (జనవరి నుంచి నవంబరు 15వరకు) ముష్కరదాడులు 63.93శాతం తగ్గాయని హోంశాఖ సాధించిన వార్షిక విజయాలపై విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
'హోం శాఖ కీలక విజయాలు'
- కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేయడం.
- 2019తో పోల్చుకుంటే ఉగ్రదాడులు 63.93శాతం తగ్గడం. ప్రత్యేక బలగాల మరణాలు 29.11శాతం, పౌరుల మరణాలు 14.28శాతం తగ్గడం.
- జమ్ముకశ్మీర్‌లో 48 కేంద్ర, 167 రాష్ట్ర చట్టాలను అమలు చేయడం ముఖ్య విజయాల్లో ఒకటి. లద్దాఖ్‌లోనూ 44 కేంద్ర, 148 రాష్ట్ర చట్టాల అమలు చేశారు.
- జమ్ముకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ ఆర్డర్-2020ని అమలు చేశారు. దీంతో జమ్ముకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ చట్టం-2019లోని సెక్షన్ 75లోని కొన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.
- జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ఉమ్మడి హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు.
- 2020 జూన్ 6న జమ్ములో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ధర్మాసనం ఏర్పాటు.
పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్, ఛాంబ్ నుంచి దేశంలోకి వచ్చిన 36,384 శరణార్థుల కుటుంబాలకు ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు హోంశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: ఉగ్రవాదుల సైబర్ వలలో కశ్మీరీ యువత!