జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు స్థానికేతరులను పొట్టనపెట్టుకున్నారు.
శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో.. ఓ వీధివ్యాపారిని కాల్చిచంపారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తిని బిహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌గా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే అరవింద్ కుప్పకూలినట్లు తెలిపారు. అరవింద్ మృతిపై విచారం వ్యక్తం చేసిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తం అందించనున్నట్లు పేర్కొన్నారు.
పుల్వామాలో మరొకరు..
పుల్వామాలో జరిగిన మరో ఉగ్రదాడిలో.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అహ్మద్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
గత వారంలో మైనారిటీలపై ముష్కరులు కాల్పులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఏరివేతను చేపట్టాయి బలగాలు. ఈ హత్యలకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను.. 24 గంటల వ్యవధిలో హతమార్చినట్లు పోలీసులు ప్రకటించిన రోజునే మళ్లీ ఇలా దుశ్చర్యకు పాల్పడ్డారు.