ఒడిశా బ్రహ్మపుర్కు చెందిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు అద్భుతాన్ని సృష్టించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో రోబో ప్రతిమను తయారు చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై (e-waste management in india) ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ మేరకు చేసినట్లు తెలిపారు. ఇందుకు బ్రహ్మపుర్ మున్సిపల్ కార్పొరేషన్ సేకరించిన 3 టన్నుల ఈ-వ్యర్థాలను వినియోగించినట్లు వెల్లడించారు. దాదాపు 30 అడుగుల ఎత్తు ఉన్న రోబోను తయారు చేశారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ-వేస్ట్ ప్రతిమ (big robot statue in india) కావడం విశేషం.
![e-waste management](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13549608_img1-2.jpg)
"ఈ రోబో ప్రతిమను తయారు చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. దాదాపు 40 మంది విద్యార్థులం శ్రమించాం. కరోనా లాక్డౌన్ సమయాన్ని ఇలా వినియోగించాము. మూడు టన్నుల వ్యర్థాలతో 30 అడుగుల ఎత్తుగల రోబోను తయారు చేశాము. ఈ-వ్యర్థాలైన కాపర్, లిథియం, పాదరసం, నికెల్, సిలీనియం, ఆర్సెనిక్, బేరియం వంటివి వాతావరణాన్ని భారీ స్థాయిలో కాలుష్యం చేస్తాయి. ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ రోబోను తయారు చేశాం."
-సందీప్ కుమార్ పండా, ఐటీఐ విద్యార్థి
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెయింటర్ గ్రూప్స్‌కు చెందిన ట్రైనీ విద్యార్థులు ఈ రోబోకు రూపకల్పన చేశారు. ఎలక్ట్రానిక్ బొమ్మలు, పీసీబీ, ప్రింటర్, ర్యామ్, కీ బోర్డ్, మౌస్, మానిటర్, మొబైల్, సీడీ ప్లేయర్, టీవీ, వీసీఆర్ తదితర వ్యర్థాలను ఉపయోగించారు.
![e-waste management](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13549608_img1-1.jpg)