IT Raids in Mythri Movie Makers Office: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో ఈ సంస్థ అవకతవకలకు పాల్పడుతుందన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ.. ఐటీ అధికారులు జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీ కార్యాలయంలో బుధవారం తనిఖీలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ.. రెండో రోజూ సోదాలు జరుపుతోంది.
IT Raids in Pushpa movie producers office : కేంద్ర బలగాల భద్రత మధ్య రెండు బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు మైత్రీ సంస్థ రికార్డులను తనిఖీలు చేశారు. ఆ సంస్థ అధినేతలైన సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు.. అప్పట్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిలో ఉన్న వివరాలకు, నిర్మాతలు చెప్పే వివరాలకు పొంతన కుదరకపోవడంతో మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అటు దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ రెండోరోజూ సోదాలు నిర్వహిస్తున్నారు.
IT Raids in Pushpa movie director's office : ఈ సంస్థ మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాని, అల్లు అర్జున్ లాంటి అగ్రహీరోలతో భారీ చిత్రాలను నిర్మించి మంచి ఆదాయాన్ని ఆర్జించింది. అయితే ఈ చిత్రాలకు విదేశీ పెట్టుబడులు ఉన్నాయనే అనుమానాలు ఐటీ అధికారులు వ్యక్తం చేశారు. తాజాగా అల్లు అర్జున్‌తో పుష్ప-2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నిర్మాణ దశలో ఉండగానే భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీంతో నిర్మాణ సంస్థ కార్యాలయంతోపాటు.. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కార్యాలయం, నివాసాల్లోనూ మరో బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.
దర్శకుడు సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటం, సొంతగా సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించడంతో వాటి ఆర్థిక లావాదేవీల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఐటీ అధికారుల తనిఖీలపై మైత్రీ మూవీ మేకర్స్ కానీ, దర్శకుడు సుకుమార్ కానీ అధికారికంగా స్పందించలేదు. పుష్ప-2 చిత్రీకరణలో ఉండగా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న సుకుమార్ హుటాహుటిన తన నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: