కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని గతేడాది నవంబర్ నుంచి దిల్లీ సరిహద్దులో మొక్కవోని దీక్షతో ఆందోళనలు చేస్తున్నారు రైతులు. ఈ నిరసనలు చేపట్టి నేటితో 6 నెలలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నల్ల జెండాలు ఎగురవేసి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. దిల్లీ-యూపీ సరిహద్దు గాజియాబాద్‌లో ఉన్న భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్.. బ్లాక్ డే సందర్భంగా నల్ల జెండాలు పట్టుకున్నారు. ఇన్ని రోజులైనా కేంద్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్ డే రోజున ఇతర ప్రాంతాల రైతులు దిల్లీ సరిహద్దుకు రావడం లేదని, వారు ఉన్న చోటు నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నారని టికాయిత్ చెప్పారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇళ్లపై నల్లజెండాలు..
బ్లాక్ డే సందర్భంగా పంజాబ్‌లోని రైతులు నిరసన వ్యక్తం చేశారు. అమృత్‌సర్‌లోని చబ్బా గ్రామం అన్నదాతలు తమ ఇళ్లు, ట్రాక్టర్లు, వాహనాలపై నల్ల జెండాలు ప్రదర్శించారు.
ఇదీ చూడండి: కొత్తగా 2.08 లక్షల కేసులు.. 4,157 మరణాలు