ISRO Recruitment 2023 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో(ఇస్రో) పనిచేయాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. అలాంటి వారికి ఇది సువర్ణావకాశం. తాజాగా ఇస్రోలో ఖాళీగా ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 303 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థుల అర్హతలు, దరఖాస్తు, ఎంపిక విధానమిదే
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇస్రో అధికారిక వెబ్ సైట్ www.isro.gov.in కి లాగిన్ అయి.. ఆన్లైన్లో అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మే 25న ప్రారంభమవగా.. ఈ నెల 14తో ముగియనుంది. ఈ 303 పోస్టుల్లో.. శాస్త్రవేత్తలు/ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో - 90, మెకానికల్ విభాగంలో - 163, కంప్యూటర్ సైన్స్ విభాగంలో - 47, ఎలక్ట్రానిక్స్ విభాగంలో (ఆటోనమస్ బాడీ- పీఆర్ఎల్)- 02, కంప్యూటర్ సైన్స్ విభాగంలో (ఆటోనమస్ బాడీ- పీఆర్ఎల్) - 01 ఉన్నాయి.
అర్హత వివరాలు
పోస్టులను బట్టి అభ్యర్థులు బీఈ, బీటెక్‌లో సంబంధిత మెకానిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84/10 సీజీపీఏతో పాసై ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ వీటికి అర్హులే. 2023 జూన్ 14 నాటికి కనీస వయసు 28 ఏళ్లు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వయో పరిమితి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.250.
అర్హత కలిగిన వారు ప్రతి పోస్టుకు రూ.250 వేర్వేరుగా చెల్లించి అప్లై చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. లేదా దగ్గర్లోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
Isro Recruitment 2023 Scientist Syllabus : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒకే పేపర్లో పార్ట్-ఏ, పార్ట్-బీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో పార్ట్-ఏలో 80 మార్కులు, పార్ట్-బీలో 20 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కులుండవు. న్యూమరిక్ అండ్ లాజికల్, డయాగ్రమెటిక్, అబ్స్ట్రక్ట్, డిడక్టివ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. రెండు పార్టుల నుంచి కనీసం 40 నుంచి 50 శాతం మార్కులు వచ్చిన వాళ్లు ఇంటర్వ్యూకు సెలెక్ట్ అవుతారు. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, దిల్లీ, తిరువనంతపురం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు సంబంధించిన వివరాలు అభ్యర్థుల ఈ-మెయిల్‌కు వ్యక్తిగతంగా పంపిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిన వారికి జీతం నెలకు రూ.56,100 ఉంటుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇతర భత్యాలూ ఉంటాయి.