ISIS Terror Activities in India : భారత్‌లో భారీ బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భగ్నం చేసింది. 4 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించిన NIA ఉగ్ర ముఠాకు చెందిన 8 మందిని అరెస్టు చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరకు, ఉగ్ర కుట్రకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది.
కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని పుణె, ముంబయి, ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్, బొకారో సహా దిల్లీలో NIA తనిఖీలు నిర్వహించింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ పోలీసుల సహకారంతో NIA ఈ సోదాలు జరిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు వ్యూహరచన చేసి పేలుడు పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. మినాజ్ నేతృత్వంలో వీరంతా పని చేస్తున్నారు.
నగదు, ఫోన్లు, డిజిటల్ పరికరాలు సీజ్
పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరకులైన సల్ఫర్, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలను నిందితుల వద్ద నుంచి NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, నేరారోపణ పత్రాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు IEDల తయారీకి ఈ సామగ్రిని ఉగ్ర ముఠా సభ్యులు ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా వీరంతా ఉగ్ర సంస్థల నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.
విద్యార్థుల నియామకంపై ఫోకస్
ఉగ్ర కార్యకలాపాల కోసం కళాశాల విద్యార్థులను నియమించుకోవడంపై వీరు దృష్టి పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ముజాహిదీన్‌కు చెందిన పత్రాలను పంపిణీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, దిల్లీ పోలీసుల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 14న ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు, కేంద్ర ఏజెన్సీలతో సమన్యవం చేసుకుంటున్నట్లు చెప్పారు.
Jammu Kashmir Encounter Today : భారత్‌లో చొరబాటుకు యత్నం.. తిప్పికొట్టిన భద్రతాబలగాలు
సైనిక స్థావరంపై ఉగ్రదాడి- మూడు విమానాలు ధ్వంసం, ఎదురుదాడిలో 9మంది ముష్కరులు హతం