Iphones Stolen In Haryana : హరియాణాలోని పల్వల్ జిల్లాకు చెందిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు దాదాపు రూ.27 కోట్లు విలువైన ఐఫోన్లను దొంగిలించారు. తాము పనిచేస్తున్న లాజిస్టిక్స్ కంపెనీలోనే చోరీకి పాల్పడ్డారు. కంపెనీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించి విచారించనున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్వల్ జిల్లా మెవాత్ ప్రాంతంలోని అలీమేవ్ గ్రామంలో జఫ్రుద్దీన్, సాఢ్వాడీ గ్రామంలో సహబ్జీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ గురుగ్రామ్‌కు చెందిన ఎన్వీఆర్ లాజిస్టిక్స్ కంపెనీలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. దాదాపు రూ.27 కోట్లు విలువైన 3700 ఐఫోన్లను లోడ్ చేసుకుని.. జులై 11న తమిళనాడులోని చెన్నై నుంచి బయలుదేరారు. గురుగ్రామ్‌లోని మానెసర్‌లో వీటిని డెలివరీ ఇవ్వాల్సి ఉంది. అయితే, డ్రైవర్లు డెలివరీ ఇవ్వకుండానే.. ట్రక్కును హోడల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ అనే గ్రామం వద్ద వదిలేసి.. ఐఫోన్లతో పారారయ్యారు.
చెన్నై నుంచి బయలుదేరి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రక్కు గమ్యం చేరుకోలేదు. అనుమానం వచ్చి ఆరా తీస్తే.. ట్రక్కును ఓ చోట పార్క్ చేసి.. ఐఫోన్లతో డ్రైవర్లు పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఎన్ఆర్వీ లాజిస్టిక్స్ మేనేజర్ రాకేశ్.. హోడల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఐఫోన్లు అమ్మాలని ప్రయత్నిస్తుండగా.. స్పెషల్ ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందుకుని.. హతిన్ మండలంలోని అంధోప్ గ్రామం వద్ద వారిని అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పల్వల్ డీఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపారు. నిందితులిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని అన్నారు. ఈ చోరీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు?.. ఫోన్లు ఎంతమందికి ఇచ్చారు? అనే కోణంలో విచారిస్తామని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని, నిందితుల పాత రికార్డులను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
రూ.8.5 కోట్లు చోరీ.. రూ.10 కోసం దొరికిపోయి..
Ludhiana Cash Van Robbery : సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు మురుగుకాల్వలో పడిపోయినట్లు.. రూ. కోట్లు కొట్టేసి రూ.10 వల్ల పట్టుబడ్డారు. దాదాపు రూ.8.5 కోట్ల సొమ్మును దోచుకొని పారిపోయారు పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు. కానీ రూ.10 కూల్‌డ్రింక్ కోసం కక్కుర్తిపడి దొరికిపోయారు. ఈ ఘటన జూన్ 10న జరిగింది. వీరెందుకు ఇలా చేశారో? ఎక్కడి నుంచి రూ.8.5 కోట్ల డబ్బును చోరీ చేశారో? తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి స్టోరీ చదివేయండి.