జమ్ము కశ్మీర్ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతేడాది ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారిగా అక్కడ ఎన్నికలకు వేళైంది. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలోని 73వ సవరణను అమలు చేసేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా.. రాష్ట్రంలోని మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (డీడీసీ)లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో నిర్వహించనున్న 8-దశల ఎన్నికల్లో భాగంగా.. తొలి దశ పోలింగ్ నవంబర్ 28న జరగనుంది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ, స్థానిక సంస్థల పనితీరు సహా వివిధ విషయాలు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.. కశ్మీర్ డివిజినల్ కమిషనర్ పాండురంగ్ కొంద్బారావు పోలె.
మొదటిసారి...
జమ్ము కశ్మీర్లో డీడీసీల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు స్వయం ప్రతిపత్తి అనుభవించిన రాష్ట్రంలో.. పంచాయతీరాజ్ చట్ట సవరణ అమలుకు నోచుకోలేదు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత.. మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పీపుల్స్ మూవ్మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. 'పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్' ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగుతున్నాయి.
పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏం చెబుతోంది ?
కశ్మీర్లో ఈ చట్టాన్ని అక్టోబర్ 16న కేంద్ర హోంశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిళ్ల ఏర్పాటు జరిగింది. ఇందులో సభ్యులను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకుంటారు.
జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టం-2019 సవరణల ద్వారా వీటిని తీసుకొచ్చారు. 370 అధికరణం రద్దుకు ముందు.. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో చట్ట సవరణలు శాసనసభ పరిధిలోనే ఉండేవి. పునర్విభజన తర్వాత ఈ అధికారం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చింది.
అంతకుముందు 1989లో జమ్ము కశ్మీర్ పంచాయతీరాజ్ చట్టంలో 73వ సవరణ తర్వాత.. ఇక్కడ స్థానిక సంస్థల ఏర్పాటుకు డిమాండ్ ఊపందుకుంది. అయితే, రాష్ట్రంలో ఎన్నికైన ఏ ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదు.
తాజా చట్ట సవరణలో రిజర్వేషన్లను సైతం పొందుపర్చారు. ముఖ్యంగా ఎస్సీ-ఎస్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం స్థానాల్లో మూడింట ఒక వంతుకు తగ్గకుండా ఈ వర్గాలకు సీట్ల కేటాయింపు జరపాలని చట్టంలో పొందుపర్చారు. అలాగే, ప్రతి డీడీసీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయవలసిన మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతి ద్వారా రిజర్వుడు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది.
డీడీసీ ఎన్నికలు.. కూర్పు-విధులు ?
పునర్విభజనకు ముందున్న జమ్ము కశ్మీర్లో.. డీడీసీ స్థానంలో పాలనా పరిషత్‌లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రణాళిక, అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసేది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహించే ఈ బోర్డులకు రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించేవారు. వీరి ఆధ్వర్యంలో బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్, నగర పరిషత్‌లు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ ఉండేవారు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి.. అందుకు అనుగుణంగా నిధులు సమకూర్చుకునేవారు.
సవరణల తర్వాత అమలవుతోన్న చట్టంలో.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 14 డీడీసీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి.. ఛైర్మెన్, వైస్-ఛైర్మెన్లను ఎన్నుకుంటారు. కొత్త చట్టం ప్రకారం స్థానిక ఎంపీ.. డీడీసీల్లో ఉండరు.
డీడీసీ ఎన్నిక ముగిసిన అనంతరం.. అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి, అమలు చేయడానికి వారికి అధికారం లభిస్తుంది. మున్సిపల్ పరిమితుల్లోకి వచ్చే ప్రాంతాలు మినహాయించి మొత్తం జిల్లాపై.. డీడీసీ అధికార పరిధి ఉంటుంది. ఒకేసారి అన్ని స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే తప్ప.. డీడీసీల పదవీకాలం ఐదేళ్లు కొనసాగుతుంది. మొత్తం సీట్లలో మూడింట ఒకటోవంతు మహిళలకు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో.. అన్ని స్థానిక సంస్థలకు కలిపి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు రావొచ్చు. అంతేకాకుండా ఈ డీడీసీ ఛైర్పర్సన్ పదవి మహిళలకు కేటాయించారు.
మొత్తంగా ప్రతి డీడీసీలో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీతో పాటు.. అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, ఆరోగ్యం-విద్య, సంక్షేమం వంటి విభాగాలకు స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. ప్రతి కమిటీలో సభ్యులతో పాటు ఛైర్పర్సన్ భాగంగా ఉంటారు. అన్ని కమిటీల్లో సమాన సంఖ్యలో సభ్యులు ఉండాలి. ఈ విధంగా జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల చరిత్రలో కొత్త శకానికి నాంది పలకబోతున్నాయి... ఈ డీడీసీ ఎన్నికలు.
సర్వం సిద్ధం..
ఎనిమిది దశల ఎన్నికల్లో భాగంగా మొదటిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 1,475 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. నవంబర్ 28న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 43 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి. వీటితో పాటే 280 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మొత్తం 2,644 పోలింగ్ కేంద్రాల్లో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ 7,03, 620 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ముష్కర ముప్పు..
డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు.. ముష్కరమూకలు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.
ప్రచారం నిషేధం..
అంతకుముందు భద్రతా కారణాలతో పార్టీల ప్రచారాలను నిషేధించారు. పార్టీలన్నీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. అభ్యర్థుల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకే.. క్షేత్రస్థాయి ప్రచారానికి అనుమతించలేదని స్పష్టం చేశారు.
మొత్తంగా లోయలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా జరుగుతున్న ఈ ఎన్నికలు.. జమ్ము కశ్మీర్ రాజకీయ భవితవ్యంపై భారీ ప్రభావమే చూపనున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమే.. ఆ రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇన్ని ప్రహసనాల మధ్య జరగనున్న జమ్ము కశ్మీర్ డీడీసీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదీ చూడండి: కశ్మీర్లో 'స్థానిక' పోరు- కార్యక్షేత్రంలోకి కాషాయదళం