అశ్లీల ప్రకటనలను ఆపేయాలని దాఖలైన వ్యాజ్యంపై విచారించిన మద్రాస్ హైకోర్టు.. వాటిపై మధ్యంతర నిషేధం విధించింది. ఈ విషయమై విరుధునగర్ జిల్లా రాజపాళయంకు చెందిన సక్కా దేవరాజ.. మధురై బెంచ్‌లో వ్యాజ్యం వేశారు. గర్భ నిరోధక, లైంగిక సమస్యలు సంబంధిత ఔషధాల గురించి చూపే ప్రకటనల వల్ల యువత పెడదారి పట్టే ప్రమాదముందని తన పిటిషన్లో పేర్కొన్నారు దేవరాజ.
ఫలితంగా మహిళలు, చిన్నారులపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని.. యువకులు నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. అందువల్ల ఇలాంటి ప్రకటనలపై సెన్సార్ విధించాలని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సంబంధిత ప్రకటనలపై మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి, తమిళనాడు వార్త, చలనచిత్ర విభాగం స్పందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ట్రేడింగ్ సంస్థ గుట్టు రట్టు- భారీగా అక్రమ సొమ్ము గుర్తింపు