సెమిస్టర్లు, సిలబస్, ప్రాజెక్టులు, ఇంటర్నల్స్ ఓవైపు...స్నేహితులు, షికార్లు, సరదాలు మరోవైపు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఇంతకుమించిన వ్యాపకాలు ఏముంటాయి? విద్యాపరంగా ప్రత్యేకతలు సాధించేందుకు శ్రమించేవారు కొందరైతే... ఆసక్తి, అభిరుచుల కోసం కష్టపడేవారు మరికొందరు. రెండో కోవకే చెందుతాడు అహ్మదాబాద్‌కు చెందిన యువరాజ్ పవార్.
ఈ యువకుడి పేరు యువరాజ్ జనార్దన్ పవార్. అహ్మదానగర్‌లోని నింభరి ఈయన స్వస్థలం. ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నాడు. ఆ యువకుడు చేసిన ఆవిష్కరణ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పల్సర్ ద్విచక్రవాహనం ఇంజిన్ వాడి, ఇంట్లో దొరికే పరికరాలతోనే వింటేజ్ కారును రూపొందించాడు యువరాజ్. పదో తరగతి చదువుతున్న తమ్ముడు ప్రతాప్ సహకారంతో కారు తయారు చేసుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఏదైనా ఆసక్తికరమైన పని చేయాలనుకున్న సోదరులిద్దరూ 150 సీసీ బైక్‌ను కారుగా మలిచారు. కుమారుల ఆవిష్కరణను చూసి, యువరాజ్ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.
"నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మా అబ్బాయి తయారుచేసిన కారులో కూర్చున్నప్పుడు మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది. చాలా చిన్న వయసులోనే ఈ కారు తయారు చేశాడు. చదువు పూర్తికాకముందే, మూడో ఏడాదిలో ఉన్నప్పుడే ఇంతమంచి కారు రూపొందించాడు."
- అనురాధా పవార్, యువరాజ్ తల్లి
టూ-వీలర్ ఇంజిన్ ఉన్న ఈ కారును రివర్స్ గేరులోనూ నడిపే అవకాశముంది. నలుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
![Inspiring story: A third year engineering student made a car used by pulsar bike engine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9557311_1.jpg)
"ముందునుంచీ నాకు కార్లంటే ఆసక్తి ఎక్కువ. మేం కూడా కారు తయారు చేయవచ్చన్న ఆలోచన రావడంతో ప్రయత్నాలు మొదలుపెట్టాం. రాజస్థాన్‌కు పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి ఓ మ్యూజియంలో రాయల్ కార్లు చూశాను. అలాంటి కార్లలో నా తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తే బాగుండని అనుకున్నా. వాళ్లకోసమే ఈ కారు తయారీకి సిద్ధపడ్డా. మా నాన్న సహాయంతో కారును విజయవంతంగా తయారుచేశా. చూడ్డానికి పాతకారులా కనిపించినా, ఈ కారులో అత్యాధునిక ఫీచర్లున్నాయి. రిమోట్ ఉపయోగించి, కారును స్టార్ట్ చేయొచ్చు, ఆపొచ్చు."
- యువరాజ్ పవార్
యువరాజ్ ఇంకా ఇంజనీరింగ్ పూర్తిచేయలేదు. అయినా ఈ వయసులోనే ఓ కారు తయారుచేసి, ఎంతోమంది ఇంజనీరింగ్ పట్టభద్రులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ విజయం అతనికి 'రియల్ ఇంజనీర్' అన్న పేరు తెచ్చిపెట్టింది.
ఇదీ చూడండి: పిచ్చుకల రక్షణ కోసం 'వీర' ప్రయత్నం