కరోనా మహమ్మారిని తరిమికొట్టే బృహత్తర కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా.. రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 60ఏళ్లు నిండిన వారు సహా.. 45ఏళ్ల నుంచి 59ఏళ్ల మధ్య వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తొలిరోజు టీకా అందించారు అధికారులు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20వేల ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేపట్టారు. ఆర్థిక స్థోమత ఉండి, వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారికి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ సౌకర్యాన్ని కల్పించారు. తొలిరోజు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా.. పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మోదీ స్వదేశీ టీకా కొవాగ్జిన్ వేయించుకున్నారు.
దిల్లీలో 80 శాతం మంది పోలీసులకు మొదటి విడత కరోనా టీకా తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకలో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథికి వ్యాక్సిన్ అందజేశారు. దిల్లీ, మహారాష్ట్ర, పుణేల్లో కరోనా టీకా కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా టీకా తీసుకున్నారు. తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన.. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరో 28 రోజుల తర్వాత మళ్లీ రెండో డోసు తీసుకుంటానని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. కరోనా టీకా తీసుకునేందుకు అర్హులందరూ ముందుకు రావాలని.. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు వెంకయ్య.
అయితే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం రోజు కరోనా టీకా తీసుకోనున్నారు. రెండు దేశీయ టీకాల్లో ఏ వ్యాక్సిన్ తీసుకోవాలన్నది న్యాయమూర్తులే నిర్ణయించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీకా తీసుకున్న పలువురు ప్రముఖులు..
ఇదీ చదవండి: 'భారత్ బయోటెక్, సీరం'లపై చైనా హ్యాకర్ల గురి!