దేశంలో కరోనా మరణాలను ఎక్కువగా పేర్కొన్న కొన్ని మీడియా కథనాలను కేంద్రం తప్పుబట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన వైద్య నిర్వహణ సమాచార వ్యవస్థ(హెచ్ఎంఐఎస్) డేటా ఆధారంగా.. ఎక్కువ కొవిడ్(Covid-19) మరణాలు సంభవించినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. బుధవారం స్పందించింది.
"సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్), హెచ్ఎంఐఎస్ డేటాను పోల్చి.. కొవిడ్ మృతులను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా పేర్కొన్నాయి. ఎలాంటి ప్రత్యేమ్నాయ ఆధారాలు లేకుండా అంచనా వేశాయి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హెచ్‌ఎంఐఎస్‌లో పొందిపరిచిన మరణాల సంఖ్యలను ఉటంకిస్తూ.. "ఇతర సమాచారం లేనప్పుడు.. అన్నీ కొవిడ్ మరణాలుగానే పరిగణిస్తూ.. కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాని ప్రకారం 2.50 లక్షల మరణాలకు కారణమేంటన్నది తెలియలేదు" అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఎలాంటి ఆధారాలు లేని మరణాలను.. కరోనా మరణాలుగా పేర్కొనడం సరికాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. అవాస్తవాలని పేర్కొంది. కొవిడ్ డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన విధానంలో కేంద్రం పారదర్శకంగా ఉందని.. కరోనా సంబంధిత మరణాలను నమోదు చేసే ప్రత్యేకమైన వ్యవస్థ ఇప్పటికే ఉందని తెలిపింది. ఇందులో కరోనా మరణాల డేటాను ఎంటర్ చేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పజెప్పినట్లు చెప్పింది. కొవిడ్ మరణాలు సరిగ్గా నమోదు చేసేలా.. భారతీయ వైద్య పరిశోధన మండలి మర్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి: 'మాటలే.. టీకాల్లేవు' - కేంద్రంపై రాహుల్ ధ్వజం