Infant Dies in Yavatmal: మహారాష్ట్రలోని యావత్మాల్లో దారుణం జరిగింది. ఆస్పత్రి వరండాలోనే మహిళ ప్రసవించగా.. నవజాత శిశువు కన్నుమూసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమని బాలింత తండ్రి ఆరోపించారు. తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే.. వారే ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చారని, అందుకే ఇలా జరిగిందని సిబ్బంది చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సుభాంగీ హఫ్సీ అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం ప్రయత్నించారు ఆమె తండ్రి. ఆ సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆటో రిక్షాలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేెంద్రానికి తీసుకుని వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆస్పత్రి సిబ్బంది కనిపించలేదు. దీంతో అక్కడి వరండాలోనే బిడ్డను కనాల్సి వచ్చింది. పుట్టిన శిశువు కాసేపటికే మరణించడంతో ఆ ఇంట విషాధ ఛాయలు అలుముకున్నాయి.
ఆస్పత్రిలో ఆ సమయంలో ఒక వైద్యాధికారి, కొందరు నర్సులు ఉన్నారని జిల్లా ఆరోగ్య అధికారి ప్రహ్లాద్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తదుపరి విచారణ జరుపుతామన్నారు.
ఇదీ చదవండి: గర్భిణీపై గ్యాంగ్‌రేప్, పోలీసుల వేధింపులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్య