కంప్యూటర్లతో మాట్లాడే 'మాధవ్'- వండర్ బాయ్ ఆవిష్కరణ - మాధవ్ వాయిస్ కమాండ్ యాప్
Voice command app Madhav: మధ్యప్రదేశ్‌కు చెందిన వండర్ బాయ్ అవి శర్మ.. సరికొత్త వాయిస్ కమాండ్ యాప్‌ను అభివృద్ధి చేశాడు. ఒక్క కమాండ్‌తో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో పనులన్నింటినీ సులభంగా చేసేలా దీన్ని రూపొందించాడు.
Voice command app Madhav: కంప్యూటర్లను సాధారణ ప్రజలకు మరింత చేరువ చేసేలా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 12 ఏళ్ల అవి శర్మ అనే బాలుడు సరికొత్త ఆవిష్కరణ చేపట్టాడు. 'అలెక్సా' వంటి వర్చువల్ సహాయ సాంకేతికత తరహాలో ఉపయోగపడే నూతన వాయిస్ కమాండ్ యాప్‌ను అభివృద్ధి చేశాడు. దానికి 'మాధవ్' అని నామకరణం చేశాడు.
Indore wonder boy Avi sharma
మాధవ్ పూర్తి పేరు.. 'మై అడ్వాన్స్‌డ్ డొమెస్టిక్ హ్యాండ్లింగ్ ఏఐ వర్షన్'. సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. దాని ద్వారా మీ కంప్యూటర్/లాప్‌టాప్‌తో మాట్లాడొచ్చు. ఫైళ్లను తెరవడం, వాతావరణ సమాచారం తెలుసుకోవడం, వికీపీడియా ఉపయోగించడం వంటి పనులన్నీ చేయొచ్చు. కంప్యూటర్/లాప్‌టాప్‌ను వాయిస్ కమాండ్‌తో ఆఫ్ చేసేందుకు కూడా వీలుండటం దీని మరో ప్రత్యేకత.
Madhav Voice command app
ఈ యాప్‌ను ఉచితంగానే అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పాడు అవి శర్మ. దివ్యాంగులు సైతం సులభంగా కంప్యూటర్ను వినియోగించేలా తన ఆవిష్కరణ దోహదం చేస్తుందని చెబుతున్నాడు. కీబోర్డ్ అవసరం లేకుండానే అన్ని పనులు చేయొచ్చని పేర్కొన్నాడు.
"అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి సాంకేతికతలు ఇప్పటికే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ, వాటి కోసం ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానికి రూ.5 వేలు ఖర్చు అవుతుంది. గూగుల్ అసిస్టెంట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడాలంటే క్రోమ్‌బుక్ ఉండాలి. కానీ చాలా మంది విండోస్, మ్యాక్‌ను వాడుతున్నారు. విండోస్‌లో కార్టనా అసిస్టెంట్ ఉన్నప్పటికీ.. దాని ద్వారా అన్ని టాస్కులను చేయలేం. కాబట్టి, అన్ని పనులు చేయగలిగే అసిస్టెంట్‌ను నేను తయారు చేశా. దానికి మాధవ్ అని పేరు పెట్టా. మాధవ్ అంటే ఈశ్వరుడి పేరు. ఈశ్వరుడికి అన్ని సాధ్యమైనట్టే.. ఈ అసిస్టెంట్ కూడా అన్ని పనులు చేస్తుంది."
-అవి శర్మ, మాధవ్ రూపకర్త
వండర్ బాయ్‌గా పేరొందిన అవి శర్మ.. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి తన ఆవిష్కరణను అంకితమిస్తున్నట్లు బాలుడు తెలిపాడు. సాధారణ ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసేలా భవిష్యత్‌లోనూ తన పరిశోధనలను కొనసాగిస్తానని చెబుతున్నాడు.
ఇదీ చదవండి: పదో తరగతి విద్యార్థిని ప్రతిభ.. ప్లాస్టిక్ కవర్లకు పరిష్కారం