సైనిక కార్యకలాపాలకే పరిమితమయ్యే శకం నుంచి భారత మిలిటరీ బయటకు వస్తోంది. దౌత్యపరమైన బాధ్యతలనూ భుజాన వేసుకుంటోంది. 2019 డిసెంబర్లో సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె.. ఇప్పటికే అనేక అధికారిక పర్యటనలు చేశారు. మయన్మార్, నేపాల్, యూఏఈ, సౌదీ అరేబియాను చుట్టివచ్చారు. ప్రస్తుతం దక్షిణ కొరియా(డిసెంబర్ 28-30) పర్యటనలో ఉన్నారు.
భారత సైన్యం చేపట్టిన దౌత్యపరమైన బాధ్యతల ఫలితాలు ప్రయోజనకరంగా ఉన్నాయి. సైన్యానికీ పలు విజయాలు దక్కాయి. నాగా అండర్‌గ్రౌండ్ లీడర్ నిక్కీ సుమి నాగా హిల్స్‌కు తిరిగిరావడం, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(కే-యంగ్ అంగ్) నేత స్టార్సన్ లమ్కాంగ్ 54 మంది గెరిల్లా యోధులతో లొంగిపోవడం భారత సైనిక దౌత్య ప్రయత్నాలకు ప్రతిఫలాలే. తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు మయన్మార్ దళాలతో సైనిక సహకారం మెరుగుపర్చడం కూడా విజయానికి కారణమని చెప్పవచ్చు.
ష్రింగ్లా వెళ్లడమే రుజువు
భారత్-మయన్మార్ మధ్య సైనిక సహకారం చాలా రోజుల క్రితమే మొదలైనప్పటికీ.. జనరల్ నరవణె బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత ముందుకెళ్లాయి. అసోం రైఫిల్స్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఉత్తర) హోదాలో కోహిమ(నాగాలాండ్ రాజధాని)లో సేవలందించడం సహా మయన్మార్‌తో అనుబంధం ఉన్న భారత సైనిక విభాగంలో పనిచేసిన నరవణెకు.. ఈశాన్య రాష్ట్రంలో తిరుగుబాటు పరిస్థితిపై చాలా వరకు అవగాహన ఉంది. కాబట్టి, అక్టోబర్ 4న మయన్మార్ పర్యటనకు నరవణె వెళ్లడం సాధారణ విషయమేనని అర్థం చేసుకోవచ్చు. కానీ, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా ఆయనతో కలిసి వెళ్లడమే ఆశ్చర్యం కలిగించే విషయం. భారత్‌లో సైనికపరమైన దౌత్య సంబంధాల విస్తరణ జరుగుతుందని ఈ పర్యటన ద్వారా అర్థమవుతోంది.
తిరుగుబాటు నేతలు తలొగ్గడానికి కారణమిదే!
భారత్, మయన్మార్ కలిసి రెండువైపుల నుంచి ఒత్తిడి పెంచడం, మయన్మార్ సైన్యానికి ఆయుధ సాయం చేయడం వల్ల నాగా తిరుగుబాటుదారుల పరిస్థితి తీవ్రంగా మారింది. ఫలితంగా సుమి, స్టార్సన్ సహా ఎన్ఎస్సీఎన్(కే) అగ్రనేత న్యెమ్లంగ్ కొన్యాక్ ప్రభుత్వంతో చర్చలకు వస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ దర్యాప్తు సంస్థ నమోదు చేసిన పలు కేసుల్లో ఈ నాగా తిరుగుబాటు నేతల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో సమయోచితంగా వ్యవహరించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
"ప్రముఖ తిరుగుబాటు నేతలంతా చర్చలకు రావడం వల్ల ఈశాన్యంలో శాంతియుత పరిస్థితులు మెరుగవుతాయి. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఎన్ఐఏ కేసుల్లో వీరంతా నిందితులుగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది."
-సంబంధిత వర్గాలు
మయన్మార్ ప్రభుత్వంతో దేశవ్యాప్త కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం కూడా నాగా తిరుగుబాటు(ఎన్ఎస్సీఎన్-కే) నేతలు లొంగిపోయేలా చేసింది. దీనికి 'దౌత్య' వ్యూహం తోడవ్వడం భారత సైన్యానికి కలిసొచ్చింది.
(సంజీవ్ బారువా, సీనియర్ పాత్రికేయులు)